ArticlesNews

ఉపకారికి బంగ్లాదేశ్ అపకారం!

80views

కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భవిష్యత్తును కాలరాసుకోవడం అంటే ఏమిటో ఇవాళ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు! రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలను ఉద్దేశపూర్వకంగా హిందువుల వైపు మరల్చి, మరీ ముఖ్యంగా హిందూ స్త్రీల పట్ల చెప్పలేని చూడలేని దారుణ మారణకాండను సృష్టిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసి కన్నీరు కార్చని హృదయం లేదు. ఎలాగో కాస్త తేరుకున్న బంగ్లాదేశ్ హిందువులు, వారికి మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలోని హిందువులు చేపట్టిన నిరసనల ఫలితంగా తాత్కాలికంగా హింసాకాండ ఆగినట్టు కనిపించినా కొద్ది రోజుల్లోనే మళ్లీ వికృత చేష్టలు మొదలయ్యాయి.

ఇందులో భాగంగానే తాజాగా ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్‌నెస్) పూజారి అయిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌పై దేశద్రోహి ముద్ర వేసి జైలుకి పంపాలన్న కుట్ర మొదలైంది. చిన్మోయ్‌ కృష్ణదాస్‌ తరఫున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాదిని అల్లరి మూకలు హత్య చేశాయి. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా బాధిత హిందువులను సమైక్యపరిచి, కాపాడేందుకు ప్రయత్నించడమే చిన్మోయ్‌ కృష్ణదాస్ చేసిన తప్పు. బంగ్లాదేశ్‌లో గత ఆగస్టు నెల నుంచి కొనసాగిన విధ్వంసకాండలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇందులో పదుల కొద్దీ ఇస్కాన్ మందిరాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు 65 దేవాలయాలుండగా 50 వేలకు పైగా భక్తులు ఉన్నారు. తాజా పరిణామాల్లో భాగంగా ఇస్కాన్‌కి వ్యతిరేకంగా జమాతే ఏ ఇస్లామి సంస్థ బెదిరింపులకు తెగబడింది. ఈ సంస్థ కార్యకర్తలు ఇస్కాన్ ఆలయ బోర్డును కూడా తొలగించి తమ సంస్థ బోర్డు పెట్టారు. అసలు చిన్మోయ్‌ అరెస్ట్‌కి ముందే బంగ్లా పోలీసులు ఇస్కాన్‌ ఉగ్రవాద సంస్థ అని వాదిస్తున్నారు. ఇస్కాన్‌ సభ్యులు భారత నిఘా సంస్థకు అనుబంధంగా పని చేస్తున్నారనీ, దేశంలో మతపరమైన హింసకు వీరే కారణమనీ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో అనేక విలయాలు సంభవించినప్పుడు అక్కడి ప్రజలకు అండగా నిలిచి, బాధితులకు అన్నవస్త్రాలూ నిత్యావసరాలూ ఇచ్చి ఆదుకున్న ఇస్కాన్‌పై దేశద్రోహి అన్న ముద్ర వేశారు.

బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల రక్షణపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. కానీ, బంగ్లాదేశ్‌ లోని యూనిస్‌ సర్కారు భారత ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఇప్పుడు తమ నిర్లక్ష్యాన్నీ, వివక్షాపూరిత వైఖరినీ కప్పిపుచ్చుకునేందుకు ఇస్కాన్‌‌ని దోషిగా చూపిస్తోంది. చిన్మోయ్‌ అరెస్ట్‌తో దేశంలోని హింసకు బాధ్యత వహించకుండా తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇస్కాన్‌ సంస్థపై నిషేధం విధించాలన్న పిటిషన్‌ని బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు తోసిపుచ్చడం ఒక్కటే కాస్త ఉపశమనం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విస్తరించిన ఇస్కాన్ కార్యకలాపాలపై, సేవలపై ఎక్కడా ఏ వివాదాలూ తలెత్తలేదు. చివరికి భారత్ దాయాది పాకిస్థాన్‌లో సైతం కరాచీ, లర్ఖానా, సింధ్, హైదరాబాద్, క్వెట్టా, బలొచిస్థాన్ ప్రాంతాల్లో ఇస్కాన్‌ సంస్థ సేవలు కొనసాగుతున్నాయి. మరెక్కడా లేని రీతిలో ఒక్క బంగ్లాదేశ్‌లోనే ఇస్కాన్‌ని లక్ష్యంగా చేసుకోవడం చూస్తే ఇది కుట్ర గాక మరేమిటి?

మూడు నెలల కిందట బంగ్లాదేశ్‌లో భారీగా వానలు కురిసినప్పుడు పలు గ్రామాలు నీట మునిగి అనేక ప్రాంతాలు జలమయమై ఆహారం, ఆశ్రయం లేకుండా పోయాయి. ఆ పరిస్థితుల్లో ఇస్కాన్ భక్తులు బంగ్లాదేశ్ వరద బాధితులకు గొప్ప సేవలందించారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ పడవలపై వరద నీటిలో బాధితుల వద్దకు వెళ్ళి ఆకలి తీర్చారు. బంగ్లాదేశ్‌లో ఇలా ప్రకృతి విలయం ఎప్పుడు సంభవించినా ఇస్కాన్ సభ్యులు చేయూతనిస్తుంటారు. బంగ్లాదేశ్‌లో హిందువుల పైనా, ఇస్కాన్ ఆలయాలపైనా దాడులు జరిగిన సమయంలో కూడా ఇస్కాన్ భక్తులు తమ సేవలను ఆపలేదు. తమపై దాడి జరిగిన చోటే వరద బాధితల కడుపులు నింపిన సహృదయత బంగ్లాదేశ్ ఇస్కాన్ సభ్యుల్లో కనిపించింది. ప్రత్యేకించి శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమయంలో కులమత బేధమన్నది లేకుండా ఆ దేశంలోని పేదలకు ఇస్కాన్ సంస్థ రేషన్ కూడా అందజేస్తూ వస్తోంది. ఇలా ఎన్నో సేవలతో బంగ్లాదేశ్ ప్రజలను అదుకున్న ఇస్కాన్‌పై లేనిపోని ఆరోపణలు చేసి నిషేధం విధించాలనడం బుద్ధి జీవులకు ఆమోదయోగ్యం కాదు.

బంగ్లాదేశ్ ప్రజలకు ఇస్కాన్ చేస్తున్న సేవలు ఇలా ఉండగా– ఆ దేశ ప్రభుత్వానికి భారత సర్కారు ఎన్ని సందర్భాల్లో అండగా నిలిచిందన్నది మరో పెద్ద చరిత్ర! బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మూలం భారత్. అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు అండగా నిలిచి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు అయ్యేందుకు సైనిక బలగాలను పంపించి అండగా నిలిచిన దేశం మన దేశం!

బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఆ దేశ జనాభాలో హిందువులు దాదాపు 20శాతం ఉండేవారు. నేడు చూస్తే అక్కడ హిందూ మైనార్టీలు 8 శాతానికి క్షీణించారు. జనవరి 2013 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో హిందూ సమాజంపై కనీసం 3,679 సార్లు దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వెల్లడించింది. అయినప్పటికీ ఆ దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం భారీగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. ఆపత్కాలంలో ఆ దేశ ప్రభుత్వానికి చేదోడువాదోడుగా నిలిచింది. మరోవైపు ఇస్కాన్ సంస్థతో పాటుగా హిందూ సమాజానికి చెందిన సంస్థలు బంగ్లాదేశ్‌లో వివిధ రకాలుగా సేవలు చేస్తున్నాయి.

ప్రస్తుత బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనిస్ నోబెల్ బహుమతి పొందిన విశిష్ట వ్యక్తి. ప్రభుత్వాధినేతగా ఆయన చొరవ చూపించి ఈ అకృత్యాలను ఆపి, చిన్మోయి కృష్ణదాస్‌ను విడుదల చేస్తారని ఆశిద్దాం. ఈ డిమాండ్‌ భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. సుమారు 150కు పైగా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, రిటైర్డ్ హైకోర్టు జడ్జీలు, రిటైర్డ్ సైనికాధికారులు సంతకాలు చేసి, గౌరవ రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో, చిన్మోయి కృష్ణ దాస్‌ను విడుదల చేసి బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలను రక్షించాలన్న డిమాండ్‌ను గట్టిగా వినిపించారు.

-డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి