ArticlesNews

దీపావళి అంటే దివ్వెల వరుస

17views

( అక్టోబర్ 31 – దీపావళి ప్రత్యేకం )

దీపావళి అంటే దివ్వెల వరుస. దీపావళి రోజు సాయంకాలం…

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే…

అని మననం చేసుకుంటూ నువ్వులనూనె లేదా ఆవునేతిని మట్టి ప్రమిదెలలో నింపి, దీపాలు వెలిగించాలి. అనంతరం దీపతోరణాలతో గృహాన్ని అలంకరించాలి. అందరికీ మిఠాయిలు పంచాలి. పిల్లలు, పెద్దలు అందరూ మందుగుండు సామగ్రిని కాలుస్తూ అమావాస్య చీకట్లను తరిమికొట్టాలి. దారిద్య్రబాధలు తొలగి, ధనలాభం పొందడానికి ఆశ్వీయుజ అమావాస్య నాడు తప్పనిసరిగా లక్ష్మీపూజ చేయాలి.

అర్ధరాత్రి చీపురుతో ఇల్లంతా చిమ్మి, ఉప్పునీట•తో కడగడం లేదా తుడవడం వల్ల అలక్ష్మి దూరంగా పారిపోతుందని నమ్మకం. అనంతరం గృహం మధ్యలో ఒకచోట కొత్త తుండు వేసి, దానిమీద నవధాన్యాలు పోసి, వాటి మీద లక్ష్మీదేవి ప్రతిమను ఉంచి యథాశక్తి పూజించి, కర్పూర హారతినివ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని శాస్త్రవచనం.

నరకుడు సత్యభామకూ, శ్రీకృష్ణునికీ కొడుకే! శ్రీమన్నారాయణుడు వరాహావతారం ధరించి హిరణ్యాక్షుడి బారినుంచి భూదేవిని కాపాడే సమయంలో భూదేవికీ, విష్ణువుకూ జన్మించాడతడు. ఆ భూదేవే సత్యభామగా అవతరించిందని, శ్రీదేవి రుక్మిణీదేవిగా, శ్రీమహావిష్ణువు కృష్ణావతారం ధరించాడనీ పురాణ గాథ. వరం ప్రకారం తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నరకుడు చావకూడదు. కన్నతల్లి చూస్తూ చూస్తూ కొడుకును చంపుకోదు కదా! కానీ కొడుకు దుర్మార్గుడై లోకాలను పీడిస్తున్నాడు. మామూలు తల్లి దండ్రులైతే, ఎంత చెడ్డ వాడైనా కొడుకునే వెనుకేసు కొస్తారు. కాని జగన్మాత లోకక్షేమం కోసం వాడిని హతమార్చేందుకు యుద్ధం చేసింది. దుర్మార్గుడైనవాడు కొడుకైనా వదలకూడదన్నదే నీతి. సంతానాన్ని తల్లిదండ్రులు చక్కగా పెంచాలి. దొంగబుద్ధి, హింస, దౌర్జన్యం వంటి అవలక్షణాలు ఉంటే చిన్ననాడే తొలగించాలి. రేపటి పౌరులు ఉత్తములుగా ఉండాలంటే, ఇవాళ్టి తల్లిదండ్రులు ఉత్తమోత్తమమైన నడవడి కలిగి ఉండాలి.

ఉప్పునీటితో ఇంటిని తుడవడం, దీపాలు వెలిగించడం వెనుక ఉద్దేశం ఆరోగ్యం. ప్రస్తుత స్థితిలో అంతటి పరిశుభ్రతను దీపావళికి పరిమితం చేస్తే సరిపోదు. ఒకేరోజు, ఒకే సమయంలో అందరి ఇళ్లలో దీపాలు వెలగడం సమైక్యత దిశగా వేసే అడుగని గుర్తించాలి. ఇలాంటి అడుగులు ఇప్పుడు మరిన్ని అవసరమని దీపాల సాక్షిగా గుర్తిద్దాం. పరిశుభ్రత భారతీయ జీవనంలో అంతర్భాగమని ప్రతిన చేద్దాం.న ఈ దీపావళి కొన్ని శాశ్వత విలువలను, సంప్రదాయాలను మనకు బోధిస్తున్నది. వాటిని విస్మరించ బోమని, మనసావాచా ఆచరిస్తామని ఈ కోట్ల దీపాల సాక్షిగా ప్రమాణం చేద్దాం.