News

అర్చకుడు వారిస్తున్నా… రామాలయంలో నమాజ్

756views

మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని రామ మందిరంలో ముగ్గురు ముస్లింలు నమాజ్ చేశారు. రుస్తమ్, అక్బర్, బాబు ఖాన్ గా గుర్తించారు. దీంతో స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో షాజాపూర్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 26 వ తేదీన సాయంత్రం 5:45 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని దేవాలయ అర్చకుడు ఓంప్రకాశ్ శర్మ వెల్లడించారు. నేరుగా దేవాలయ ఆవరణలోకి ముగ్గురు ముస్లింలు ప్రవేశించి, వారి పద్ధతి ప్రకారం నమాజ్ చేయడం ప్రారంభించారని పేర్కొన్నారు.

తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని, దాదాపు 20 నిమిషాలు దేవాలయ ఆవరణలోనే వున్నారని తెలిపారు. స్థానికంగా వుండే బ్యాంకు నుంచి తిరిగి వస్తుండగా వారు మందిరంలోకి ప్రవేశించారని వెల్లడించారు. అయితే.. పోలీసులు కేసులు నమోదు చేశారు కానీ, కాసేపటికే ఆ ముగ్గురు ముస్లింలను విడిచేశారు. దీంతో హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను భంగపరిచారని, అలాంటి వారిని ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై కఠినంగా వుండాల్సింది పోయి… ఇంత అలసత్వం ఏంటని మండిపడుతున్నారు. కావాలనే ముగ్గురు ముస్లింలు దేవాలయంలో నమాజ్ చేశారని, ఇతర ప్రదేశాలను ఎంచుకునే అవకాశం వున్నా… మందిరంలోనే చేశారని అన్నారు.అయితే విచారణ జరుగుతోందని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు ప్రకటిస్తున్నారు.