ArticlesNews

1200 ఎకరాల్లో వక్ఫ్ మోసం.. రాత్రికి రాత్రే రికార్డుల మార్పు..

60views

కర్నాటక వక్ఫ్ బోర్డు రైతులను నిలువునా మోసం చేసింది. రాత్రికి రాత్రే రైతులను భూములను తమవని రికార్డులను తారుమారు చేసేసింది. ఇది జరిగింది విజయపురలో. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 1200 ఎకరాల రైతుల భూములు వక్ఫ్ భూములని ప్రకటించుకుంది. ఇంతకు ముందు ఆ భూముల రికార్డుల్లో వక్ఫ్ అని లేనేలేదు. రాత్రికి రాత్రి వక్ఫ్ అని వచ్చిపడింది. ఈ డాక్యుమెంట్ల ట్యాంపరింగ్ పై సోషల్ మీడియాలో కూడా వచ్చింది. గత మూడు వారాల్లోనే ఈ రికార్డుల తారుమారంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోయినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆర్టీసీలో రికార్డ్ ఆఫ్ రైట్స్, టెనన్సీ అండ్ రికార్డ్స్ ఆఫ్ క్రాప్స్) లో మ్యుటేషన్ జరిగినట్లు అంటున్నారు.

అయితే ఇంత ప్రక్రియ జరిగినా రైతులకు మాత్రం ఎవ్వరూ చెప్పనేలేదు. వారు కూడా గ్రహించలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, వ్యవహారం కూడా బయటికి పొక్కడంతో కర్నాటక సర్కార్ అప్రమత్తమైంది. దీనిపై వివరణ ఇచ్చుకుంది. గెజిట్ నోటిఫికేషన్ లో వున్న లోపం వల్లే ఇలా జరిగిందని మంత్రి హెచ్.కే. పాటిల్ చెప్పుకొచ్చారు. రైతుల భూములను వక్ఫ్ భూములుగా మార్చే ఉద్దేశం తమకు లేదని, తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని చెప్పారు. జారీ చేసిన నోటీసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

మంత్రి రాక, ఆదేశాలతో రాజుకున్న వివాదం
కర్నాటకలోని విజయపూరలో వక్ఫ్ ఆస్తుల అంశం తీవ్ర వివాదాన్ని రేపింది. వక్ఫ్‌కి సంబంధించిన భూ సర్వేలు, వక్ఫ్ ఆస్తుల ఖాతాల మార్పులను వేగిరం చేయాలని కర్నాటక మైనారిటీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించడంతో వివాదం రేగింది. తమకు తమ పూర్వీకుల నుంచి భూములు వచ్చాయని, తాము పంటలు పండించుకునే భూములు వక్ఫ్ భూములని ఎలా గుర్తిస్తారంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు మంత్రి అహ్మద్ ఖాన్ విజయపురలో పర్యటించారు. ఈ సందర్భంగా వక్ఫ్ ఆస్తుల అదాలత్ నిర్వహించి, వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి పురోగతిని సమీక్షించారు. నెల రోజుల్లోగా సర్వేలు పూర్తి చేయాలని, లెక్కల్లో చూపని వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సర్వేలు పూర్తి చేయాలని ఆదేశించారు.

టికోడా తాలూకాలోని హోన్వాడ గ్రామంలోని రైతులు మంత్రి నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1200 ఎకరాలు చట్టవిరుద్ధంగా వక్ఫ్ బోర్డు ఆస్తిలో చేర్చేసేందుకు సన్నద్ధమవుతున్నారని, అవన్నీ తమ పూర్వీకుల నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూములని పేర్కొంటున్నారు.

తమ భూముల్లో అసలు దర్గానే లేదని, కానీ… తమ భూములు షా అమీనుద్దీన్ దర్గాకి సంబంధించినవని అధికారులు అంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఈ భూములపై సర్వ హక్కలూ వక్ఫ్ కి వున్నాయని అధికారులు అంటున్నారని రైతులు పేర్కొన్నారు. వందలాది మంది రైతులు మంత్రి నిర్ణయాన్ని, అధికారుల చర్యలను నిరసిస్తూ రోడ్డెక్కారు. ఈ భూములు తమవేనని స్పష్టమైన ఆధారాలున్నా… తమ భూమును వక్ఫ్ పరిధిలోనివని రికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు అన్నారు.తమ పూర్వీకులు ఈ భూమిని వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇవ్వలేదని లేదా విక్రయించలేదని, రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం రికార్డులను తారుమారు చేశారని మండిపడుతున్నారు.తమ సమస్యలను పరిష్కరించకుంటే మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తూనే వుంటామన్నారు.