
భారత్ లో తన నివాస గడువు ముగియటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సామాజిక మాధ్యమాల్లో సోమవారం ఉదయం పోస్టు పెట్టగా, సాయంత్రానికల్లా పొడిగింపునకు అనుమతి ఇచ్చారని బంగ్లాదేశ్ రచయిత్రి, హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ (62) తెలిపారు. గత మూడు నెలలుగా తాను ఆందోళన చెందుతున్న విషయానికి ఒకేరోజులో పరిష్కారం చూపిన అమిత్ షాకు థాంక్స్ చెబుతూ వెంటనే ‘ఎక్స్’ లో మరో పోస్టు పెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఇంకో ఏడాదికాలం తన నివాస అనుమతి పొడి గిస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ఈ బంగ్లా రచయిత్రికి సమాచారం చేరవేసింది.
ఇస్లామిక్ ఛాందసవాదానికి వ్యతిరేకంగా గళమెత్తిన మహిళావాద రచయిత్రిగా పేరొందిన తస్లీమా నస్రీన్ సంచలనం రేపిన ‘లజ్జ’ నవ లతో వివాదాల్లో చిక్కుకొన్నారు. 1994లో బంగ్లాదేశ్ ఆమెను దేశం నుంచి బహిష్కరించాక, 2004 నుంచి భారత్లోఊ ఆశ్రయం పొందుతున్నారు. “నా వీసా గడువు మూడు నెలల క్రితమే ముగిసింది. ఈసారి పునరుద్ధరణ ఆలస్యం కావడంతో ప్రభుత్వం పొడిగించాలని అనుకోవడం లేదేమో అని ఆందోళనకు గురయ్యా. అదే నిజమైతే నేను ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడ ఉండాలి? అని నిద్ర లేని రాత్రులు గడిపా. చివరి అవకాశంగా నేరుగా అమిత్ షాకు విజ్ఞప్తి చేశా” అని తస్లీమా వివరించారు. ఇస్లామిక్ ఛాందసవాదులు, వామపక్ష నేతలు చాలా మంది తనను భాజపా మద్దతుదారుగా భావిస్తారని, వాస్తవానికి ప్రభుత్వంలోని వ్యక్తులెవరూ తనకు తెలియ దన్నారు. కొంతమంది జిహాదీలు తాను చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పంపడంతో ఫేస్ బుక్ తన ఖాతాను నిలిపివేసిందని. ఆ తర్వాత పలుమార్లు విజ్ఞప్తి చేసినా పునరుద్ధరించలేదని ఆమె తెలిపారు. తన నకిలీ మరణంపై జిహాదీలతో కలిసి ఫేస్ బుక్ వేడుక చేసుకొంటున్నట్లు తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు





