
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ సంస్కృత యూనివర్శిటీలో హిజాబ్ వివాదం రేగింది. ముస్లిం విద్యార్థులు బురఖా, హిజాబ్ ధరించి రావడంతో వివాదం మొదలైంది. దీంతో సనాతన ధర్మం పరిఢవిల్లే ప్రాంతంలో ఇస్లామికీకరణ ప్రయత్నాలు మొదలయ్యాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హిజాబ్ ధరించి యూనివర్శిటీలో తిరుగుతున్న వీడియో వైరల్ అయ్యింది. నిజానికి యూనివర్శిటీలో చాలా మంది ముస్లిం అమ్మాయిలు చదువుతున్నారు. కానీ… ఇంతకు పూర్వం మామూలు వస్త్రధారణలోనే వచ్చారు. కొన్ని రోజులుగా మాత్రం హఠాత్తుగా హిజాబ్ ధరించి రావడం మొదలుపెట్టారు.
మరోవైపు ఈ విషయంపై యూనివర్శిటీ వీసీ దినేష్ చంద్ర శాస్త్రితో అడగ్గా… ఈ హిజాబ్ వివాదం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్, సంబంధిత విషయాధికారులతో వీసీ సమావేశమయ్యారు. విద్యార్థులు బురఖా మార్చుకొని, తరగతి గదికి వెళ్లేలా చూడాలని, మార్చుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే.. సంస్కృత విశ్వవిద్యాలయంలో కూడా ఇస్లామిక్ సంస్కృతిని ప్రవేశపెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో హరిద్వార్ లో కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది.





