
విజయనగరం జిల్లా భామిని మండలం సతివాడ సమీపంలోని నూకాలమ్మ గూడ వద్ద అక్షరబ్రహ్మ నూతన ఆలయ ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. అక్షరబ్రహ్మ కో-ఆర్డినేటర్ సవర కరువయ్య ఆధ్వర్యంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ చేతుల మీదుగా నిర్వహించారు. ఇరురాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల గిరిజనులు ఆలయాన్ని అలంకరించారు. అనంతరం ఆదివాసీ మహిళలు థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో అతిథులకు ఘన స్వాగతం పలికారు. పాలకొండ తెదేపా ఇన్‌ఛార్జ్జి పడాల భూదేవి, ప్రముఖ సామాజిక వేత్త గీతాశ్రీకాంత్ ఫౌండేషన్ ఛైర్మన్ గీతా శ్రీకాంత్ జ్యోతి ప్రకాశనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్షరాన్ని దైవంగా భావించి పూజించటం గొప్ప సంప్రదాయమని కొనియాడారు. అనంతరం పడాల భూదేవి, గీతాశ్రీకాంత్‌లు కలసి ఆదివాసీ గిరిజనులతో థింసా నృత్యాలు చేసి సందడి చేశారు. తితిదే నుంచి శ్రీవాణి ట్రస్టు సభ్యులు ఆలయ నిర్మాణానికి రూ.10లక్షలు అందించారు.





