ప్రధాని నరేంద్ర మోదీ దుర్గామాత ఉపాసకుడు. శరన్నవరాత్రుల సందర్భంగా ఆయన ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేకంగా ఓ గర్భా గీతాన్ని రాశారు. ఆ పాటను వీడియోగా తీశారు. దుర్గామాతకు సమర్పించిన ఆ గీతం అందర్నీ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ సాంగ్ వైరల్ అవుతున్నది.
మంగళకరమైన నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు భిన్నరూపాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారని, ప్రజలందరూ దుర్గామాత భక్తితో ఏకం అయ్యారని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆ భక్తి పారవశ్యంతో.. దుర్గాదేవి శక్తి, కరుణకు నివాళిగా గర్భా గీతాన్ని రాసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో మోదీ కోరారు.
”ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా, వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘ఆవతీ కాలయ్’ అనే గర్బా పాటను రాశాను. మనందరిపై దుర్గా దేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.’ అని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అవతికాలే పేరుతో గర్భా గీతాన్ని ప్రధాని రాశారు. అయితే ఆ సాంగ్‌ను పాప్ సింగరర్ పుర్వ మంత్రి పాడారు. ఆమె ట్యాలెంటెడ్ యువ సింగర్ అని, చాలా అద్భుతమైన రీతిలో ఆ గాయని తాను రాసిన గీతాన్ని పాడినట్లు మోదీ మరో ట్వీట్లో తెలిపారు.
మరోవైపు, ఒక వ్యక్తి తన జీవితాంతం దేశ సేవ ఎలా చేస్తారని చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణం నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ రాజకీయాల్లోకి వచ్చి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.
‘2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 13 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా సోమవారంతో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణమే, ప్రజా సేవ కోసం ఒక వ్యక్తి తన జీవిత మొత్తాన్ని ఎలా అంకితం చేయగలరనే విషయానికి ప్రతీక’ అని కొనియాడారు.
“ఆయన రాజకీయ ప్రయాణంలో నిరంతరం హోంమంత్రిగా తోడుగా ఉండటం నా అదృష్టం. పేదల సంక్షేమం, భద్రత, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలా పని చేయాలో ప్రధాని నరేంద్ర మోదీ చూపించారు. 23 ఏళ్లుగా నిరాటంకంగా, అలసిపోకుండా, తనను తాను పట్టించుకోకుండా దేశానికి, ప్రజల సేవకే అంకితం ఇచ్చారు” అని అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రశంసించారు.