News

జోగుళాంబకు రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు

8views

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని,స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్, వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం తో తీర్థప్రసాదాలు, స్వామి, అమ్మ వార్ల చిత్రపటాన్ని అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని పాటిస్తూ జిల్లా కలెక్టర్ గా జోగుళాంబా సమేత శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు. అలంపూర్ తన అమ్మమ్మ గారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపేవాళ్ళం అని కలెక్టర్ అలంపూర్‌ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.