News

మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలో భరతమాత విగ్రహం పునఃప్రతిష్ఠ

45views

గుంటూరు జిల్లా తాడేపల్లిలో భరతమాత విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పునః ప్రతిష్ఠించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని భరతమాత విగ్రహాన్ని గత ప్రభుత్వ హయాంలో తొలగించారు. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో మళ్ళీ ప్రతిష్ఠించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడేపల్లికి చెందిన ఆర్​​ఎస్​ఎస్​ నేతలు, స్థానికులు 3 లక్షల రూపాయలతో విగ్రహాన్ని కొనుగోలు చేసి మళ్ళీ అదే స్థానంలో ప్రతిష్ఠించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారి విస్తరణ పేరుతో భరతమాత విగ్రహాన్ని తొలగించారు. అప్పట్లోనే ఈ ఘటనను పలువురు ఖండించడంతో పాటు నిరసన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించి ఐదేళ్ళు అయినప్పటికీ మళ్లీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆర్ఎస్ఎస్ సాయంతో స్థానికులే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

తాళ్ళాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా రాజధాని ప్రాతంలో భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని శివస్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.