ArticlesNews

మూడేళ్ల కొడుకును పణంగా పెట్టి… భగత్‌సింగ్‌ను కాపాడిన భాభీ

48views

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌వీర్‌… వీరంతా ఆమెను ‘దుర్గా భాభీ’ అని పిలిచేవారు. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్‌ వారిని దేశం నుంచి తరిమికొట్టగలం అని భావించిన దళంలో పిస్తోల్‌ పట్టిన తొలి విప్లవ వనిత దుర్గావతి దేవి. బ్రిటిష్‌ అధికారి సాండర్స్‌ను హత్య చేసిన భగత్‌సింగ్‌ను లాహోర్‌ నుంచి తప్పించేందుకు అతడి భార్య అవతారం ఎత్తిందామె. చరిత్ర పుటలలో కనుమరుగై పోయిన ఆ త్యాగమయి గురించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా…

‘సైమన్‌ గోబ్యాక్‌’ నిరసన కార్యక్రమం చేస్తున్న లాలా లజపతిరాయ్‌ మీద బ్రిటిష్‌ పోలీసుల లాఠీచార్జీ జరిగి ఆయన ప్రాణం పోయింది. పంజాబ్‌లో యువతకు మార్గదర్శిగా ఉన్న ఆ మహా నాయకుణ్ణి కోల్పోయినందుకు ‘హిందూస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్యులకు ఆగ్రహం వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరయోధుడు భగవతి చరణ్‌ ఓహ్రా నడుపుతున్న గ్రూప్‌. చంద్రశేఖర ఆజాద్, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ తదితరులంతా ఇందులో సభ్యులు. వీరంతా కలిసి లాఠీచార్జిని ఆర్డర్‌ వేసిన బ్రిటిష్‌ ఆఫీసర్‌ స్కాట్‌ను చంపాలనుకున్నారు. నిర్ణయం అమలు పరచడమే తరువాయి.

స్కాట్‌ బదులు సాండర్స్‌
భగత్‌ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ఈ ముగ్గురు 17 డిసెంబర్‌ 1928న లాహోర్‌లో పోలీస్‌ ఆఫీసర్‌ స్కాట్‌ను హతమార్చడానికి సిద్ధమయ్యారు. అయితే బైక్‌ మీద రావాల్సిన స్కాట్‌ కారులో, కారులోనూ రావాల్సిన మరో అధికారి సాండర్స్‌ బైక్‌ మీద రావడంతో అయోమయం నెలకొంది. అయినా సరే ఎదురుపడిన సాండర్స్‌పై మొదట రాజ్‌గురు, ఆ తర్వాత భగత్‌ సింగ్‌ తుపాకీ పేల్చి అతణ్ణి హతమార్చారు. లాహోర్‌ అంతా గగ్గోలు రేగింది. వందలాది మంది పోలీసులు అన్ని దారులు… బస్టాండ్లు… రైల్వేస్టేషన్లు కమ్ముకున్నారు. లాహోర్‌లో ఉండటం భగత్‌సింగ్‌కు ఏ మాత్రం మంచిది కాదు. అతణ్ణి తప్పించేవారు ఎవరు?

ఆమె వచ్చింది
భగవతి చరణ్‌ ఓహ్రా సతీమణి దుర్గావతిని అందరూ దుర్గాభాభీ అని పిలిచేవారు. సాండర్స్‌ని హత్య చేశాక భగత్‌సింగ్, రాజ్‌గురు నేరుగా దుర్గావతి దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆమె భర్త వేరే పని మీద కలకత్తా వెళ్లి ఉన్నాడు. జరిగింది తెలుసుకున్న దుర్గావతి వెంటనే భగత్‌సింగ్‌ను లాహోర్‌ దాటించడానికి సిద్ధమైంది. జుట్టు కత్తిరించుకుని హ్యాట్‌ పెట్టి రూపం మార్చిన భగత్‌సింగ్‌కు ఆమె భార్యగా నటిస్తూ తన మూడేళ్ల కొడుకుతో మరుసటి రోజు సాయంత్రం లాహోర్‌ నుంచి డెహ్రాడూన్‌ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో మొదటి తరగతి ప్రయాణికురాలిగా బయల్దేరదీసింది.

వందలాది నిఘా కళ్ల మీద ఈ పని చేయడం చాలా ప్రమాదం… మూడేళ్ల కొడుక్కు కూడా ఏదైనా కావచ్చు అని భగత్‌సింగ్‌ ఆమెతో అన్నాడు. ‘నా కొడుక్కు మరణం సంభవిస్తే ఒక దేశభక్తునిగా తన ప్రాణం అర్పించే అవకాశం వాడికి దక్కుతుంది’ అని చెప్పి ఆమె ముందుకు కదిలింది. భగత్‌సింగ్‌ ఆధునికవేషంలో ఉన్న అధికారిగా, దుర్గావతి అతని భార్యగా, రాజ్‌గురు నౌకరుగా ఆ ప్రయాణం చేశారు. బ్రిటిష్‌ వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాలేదు. భగత్‌సింగ్‌ను అలా క్షేమంగా కలకత్తా చేర్చి వెనక్కు వచ్చింది దుర్గావతి.

గొప్ప దేశభక్తురాలు
స్వతంత్ర పోరాటం చేస్తున్న భగవతి చరణ్‌ ఓహ్రాను వివాహం చేసుకునేనాటికి దుర్గావతికి 13 ఏళ్లు. పెళ్లి తర్వాతనే చదువుకుంది. ఇంట్లో ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. సాయుధ పోరాటం చేయాలన్న భర్త ఆశయానికి మద్దతుగా నిలిచిందామె. భగత్‌సింగ్‌ను తన కన్నబిడ్డలా భావించింది. భగత్‌సింగ్‌ పార్లమెంట్‌లో బాంబు దాడి చేసి అరెస్ట్‌ అయ్యాక ఆ తర్వాతగాని అతడే సాండర్స్‌ హత్యలో ఉన్నాడన్న సంగతి పోలీసులకు తెలియలేదు. ఆ కేసు వాదనలను బ్రిటిష్‌ ప్రభుత్వం హడావిడిగా ముగించి అక్టోబర్‌ 7, 1930న తీర్పు వెలువరించి భగత్‌సింగ్‌కు మరణశిక్ష విధించింది. అయితే లాహోర్‌లో ఈ విచారణ జరుగుతున్నప్పుడు భగత్‌సింగ్‌ను తీసుకెళ్లే వ్యానుపై బాంబుదాడి చేసి అతణ్ణి కాపాడాలని ప్లాన్‌ చేసింది దుర్గావతి. వీలు కాలేదు.

భర్తను కోల్పోయి
భగత్‌సింగ్‌ను జైలు నుంచి రక్షించడానికి స్వదేశీ జ్ఞానంతో బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు భగవతి చరణ్‌ ఓహ్రా మరణించాడు. అంత కష్టాన్ని తట్టుకుని దేశం కోసం పోరాడాలనుకుంది దుర్గావతి. భగత్‌సింగ్‌ మరణశిక్ష విధించాక ఆగ్రహంతో బొంబాయి వెళ్లి బ్రిటిష్‌ గవర్నర్‌ను చంపాలనుకుంది. అయితే గవర్నర్‌ దొరకలేదు. మరో బ్రిటిష్‌ అధికారి మీద స్వయంగా గుళ్ల వర్షం కురిపించి పగ చల్లార్చుకుంది. భగత్‌ సింగ్‌ ఉరి (1931 మార్చి 23) తర్వాత తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడం, పోలీసుల వెతుకులాట ఎక్కువ కావడంతో తనే వెళ్లి లొంగిపోయింది. మూడేళ్ల జైలు శిక్ష అనంతరం మొదట లక్నో ఆ తర్వాత ఘజియాబాద్‌లో పెద్దగా పబ్లిక్‌లో ఉండటానికి ఇష్టపడక స్కూల్‌ నడుపుతూ 1999లో తన 92వ ఏట మరణించిందా గొప్ప దేశభక్తురాలు, భారత తొలి సాయుధ పోరాట సమరయోధురాలు దుర్గాభాభీ.