News

‘చాముండేశ్వరి ఆలయం మా సొంతం, దాన్ని లాక్కునే ప్రయత్నాలను కాంగీ ప్రభుత్వం ఆపాలి’

39views

సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను గౌరవించాలని మైసూరు రాజవంశం కోరింది. ఆ ఆలయం తమ రాజవంశానికి చెందిన ప్రైవేటు ఆస్తి అనీ, దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను కర్ణాటక ప్రభుత్వం ఆపేయాలనీ రాజకుటుంబం కోరింది.

కర్ణాటకలోని ప్రఖ్యాత చాముండేశ్వరీ దేవాలయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది. ఆ గుడిని, దాని అనుబంధ ఆలయాలనూ, వాటి ఆస్తులనూ చేజిక్కించుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలో శ్రీ చాముండేశ్వరీ క్షేత్ర డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయడానికి చట్టం చేసింది. అయితే రాష్ట్రప్రభుత్వపు ఆ ప్రయత్నం మీద హైకోర్టు తాజాగా సోమవారం నాడు స్టే విధించింది.

ఆ సందర్భంగా మైసూరు రాజవంశం వారసుడు, ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మాట్లాడుతూ ‘‘అథారిటీ ఏర్పాటు ద్వారా చాముండేశ్వరీ హిల్స్‌ మీద నియంత్రణ సాధించడానికి కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం నిలిపివేసింది. ఇన్నేళ్ళుగా అనుసరిస్తున్న విధానాలను అలాగే కొనసాగించాలి. సంప్రదాయాన్ని గౌరవిస్తూ న్యాయస్థానం తదుపరి నోటీసులు జారీ చేసేవరకూ స్టే విధించింది. ఈ విషయం ఇంకా న్యాయస్థానం పరిధిలోనే ఉంది కాబట్టి ఇంతకుమించి వ్యాఖ్యానించకూడదు’’ అని చెప్పారు.

దానికి స్పందనగా కర్ణాటక సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న మాట్లాడారు. ‘‘ఇప్పుడు రాజులూ, రాణులూ లేరు, రాజకుటుంబాలు లేవు. బెంగళూరు ప్యాలెస్‌ గురించి ఇదే విషయం, ఇదే గొడవ సుప్రీంకోర్టులో జరుగుతోంది. కాబట్టి ఈ రాజకుటుంబపు ఆస్తిని పంచిపెట్టాలి, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంచిపెట్టాలి. ఆ వివాదం ఇంకా నడుస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.

సోమవారం నాడు మైసూరు రాజకుటుంబంలోని రాజమాత ప్రమోదాదేవి వొడయార్ ఈ విషయం మీద మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘చాముండేశ్వరీదేవి మా రాజకుటుంబానికి ఇలవేల్పు. చాముండి కొండ మీదున్న శ్రీ చాముండేశ్వరీ ఆలయం, మిగతా దేవాలయాలు రాజకుటుంబపు ప్రైవేటు ఆస్తులు. అయితే చాముండేశ్వరీ ఆలయం అభివృద్ధి, నిర్వహణ సాకుతో ఆ గుడులన్నింటినీ తమ స్వాధీనం చేసుకోడానికి, వాటి నిర్వహణ నియంత్రణలను తమ గుప్పెట్లోకి లాక్కోడానికి రాష్ట్రప్రభుత్వం చాముండేశ్వరీ ల్యాండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్ 2024 పేరిట చట్టం చేసింది. ఆ చట్టానికి వ్యతిరేకంగా మేము కోర్టుకెక్కాం. అథారిటీని ఏర్పాటు చేయవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. అందువల్ల ఆ చట్టం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టమైంది’’ అని ఆవిడ ప్రకటన విడుదల చేసారు.

‘‘1971లో రాజ్యాంగానికి చేసిన 26వ సవరణ ద్వారా అప్పటి కేంద్రప్రభుత్వం రాజకుటుంబాలన్నీ తమ ఆస్తుల జాబితాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు మైసూరు రాజకుటుంబం ఆస్తుల జాబితాను సమర్పించింది. అందులో చాముండి కొండ మీదున్న గుడిని కూడా చేర్చింది. 1972లో అప్పటి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ జాబితాపై సంతకం చేసి ఆమోదముద్ర వేసారు’’ అని ప్రమోదాదేవి వివరించారు.

ఈ యేడాది ఫిబ్రవరిలో కర్ణాటక ప్రభుత్వం శ్రీ చాముండేశ్వరీ క్షేత్ర డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం కోసం చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ఆలయానికి సంబంధించిన అన్ని స్థిర చర ఆస్తుల యాజమాన్యం, నిర్వహణను రాష్ట్రప్రభుత్వం తీసేసుకుంటుంది.

‘‘స్వతంత్రం వచ్చిననాటినుంచి ఇప్పటివరకూ అన్ని ప్రభుత్వాలూ మమ్మల్ని వేధిస్తూనే ఉన్నాయి. చాముండిబెట్ట మీద ఉన్న చాముండేశ్వరీదేవి ఆలయం, ఇతర దేవాలయాలు, మిగతా ఆస్తులూ మైసూరు రాజవంశానికి చెందినవి అని 2001లో శ్రీకంఠదత్త నరసింహరాజ వొడయార్ న్యాయస్థానంలో కేసు దాఖలు చేసారు. ఆ కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఇంకా విచారణ చేస్తోంది’’ అని రాణి వివరించారు. దేవాలయాల పవిత్రతను, ఆధ్యాత్మికతను వాణిజ్యపరంగా దోచుకోడానికి ప్రభుత్వానికి సైతం అనుమతి లేదని ఆమె వ్యాఖ్యానించారు.