News

బంగ్లాదేశ్ హిందువుల క్షేమం కోసం కంచి మఠం ప్రత్యేక పూజలు

36views

యావత్ ప్రపంచంలోని హిందూ సమాజాన్ని ఆవేదనకు, ఆందోళనకు గురిచేసిన బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అక్కడ శాంతి నెలకొనాలని, సాధారణ స్థితి ఏర్పడాలని కంచి శంకరాచార్య పీఠం ఆకాంక్షించింది. బంగ్లాదేశ్ హిందువులతో పాటు ఆ దేశంలోని పరిస్థితులు చక్కబడాలని కోరి కంచి కామకోటి పీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి నేతృత్వంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

బంగ్లాదేశ్‌లో సుప్రసిద్ధ శక్తిపీఠమైన ఢాకేశ్వరీ మందిరంతో పాటు పలు చారిత్రకమైన హిందూ దేవాలయాలున్నాయని, పెద్ద సంఖ్యలో హిందువులు నివసిస్తున్న ఆ దేశంలోని హిందూ సమాజం శాంతియుత వాతావరణంలో క్షేమంగా ఉండాలని, నిలకడైన సామాజిక స్థితిగతులు ఏర్పడాలని కంచి శంకరాచార్యస్వామివారు ఆకాంక్షిస్తున్నారని తెలియజేస్తూ కంచి పీఠం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

కంచి మఠం 69వ పీఠాధిపతి పూజ్య జయేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి 2000వ సంవత్సరంలో ఢాకాలోని ఢాకేశ్వరీ మందిరాన్ని దర్శించి పూజలు నిర్వహించారని, వీరి సందర్శనను పురస్కరించుకుని ఆ మందిరపు ఒక గేటుకు “శంకరాచార్య గేట్” అని నామకరణం చేసినట్లు కంచి మఠం ప్రకటన తెలియజేసింది.

బంగ్లాదేశ్‌లో హిందూవులపై జరుగుతున్న ఘోరాల చిత్రాలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మూలంగా తెలుసుకుంటున్న హిందూ సమాజం భగ్గుమంటోంది. అక్కడి ముస్లిం ఛాందసవాదుల చర్యలను ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు, ఆందోళన ర్యాలీలను నిర్వహిస్తున్నారు. అటు విదేశాలలోను, ఇటు స్వదేశంలోను ఊరూరా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ దురాగతాలను ప్రశ్నిస్తూ నిలదీస్తూనే బంగ్లాదేశ్ హిందువుల క్షేమం కోసం పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.