News

“సక్షమ్-కాంబా” ఆధ్వర్యంలో “BLIND FOLD WALK RALLY”

120views

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలంలో సక్షమ్ (సమదృష్టి, క్షమతా వికాసము మరియు అనుసంధాన మండలి) దివ్యాంగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆద్వర్యంలో నేత్రదానం పై అవగాహన కోసం, కార్నియా అంధత్వ నివారణ కోసం వినూత్నంగా “BLIND FOLD WALK RALLY” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సిద్ధార్ధ  హైస్కూలు నుండి దుత్తలూరు బైపాసు రోడ్డు వరకు దాదాపు కిలోమీటర్ కు పైగా సాగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నెల్లూరు జిల్లా అద్యక్షులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి, సక్షమ్ ఆంద్ర ప్రాంత కార్యకారిణి మరియు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయనిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. శ్రీ సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ నేత్రదానం మాత్రమే అంధత్వాన్ని జయించగలదని, మన మరణానంతరం చేసే నేత్రదానం ద్వారా ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగులు నింపగలమని, దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా వారిని గౌరవించి సమాన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించగలరని తెలియజేశారు. శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అంధుల బాధలు అనుభవిస్తే కానీ అర్థం కాదనీ ఈ ఉద్దేశ్యంతోనే కళ్లకు గంతలు కట్టుకుని నడిచి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్నంగా ప్రయత్నించామని, 34వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగముగా దేశంలోనే అన్నిరాష్ట్రాల్లో, జిల్లాలలో, మండలాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించామని, అన్ని రకాల వైకల్య బాధితుల కోసం అఖిల భారత స్ధాయిలో దివ్యాంగుల సర్వతోముఖాభివృద్ధి కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ సక్షమ్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ దుత్తలూరు, కొండాపురం కన్వీనర్లు శ్రీ సిముని వెంగళ రెడ్డి, శ్రీ వడ్డే పరబ్రహ్మయ్య, RSS కావలి జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీ మన్నేటి శ్రీనివాసులు రెడ్డి, వింజమూరు ఖండ ప్రచార ప్రముఖ్ శ్రీ నర్రావుల పుల్లారెడ్డి, సిద్దార్ధ హైస్కూలు మరియు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు, వివిద రాజకీయ పార్టీల నాయకులు, MRO, MEO, సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీ జంపాని కుమార్, ప్రాథమిక వైద్యశాల డాక్టరు గారు, పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.