News

రాజస్థాన్ లో 3 రోజుల ఆర్ ఎస్ ఎస్ సమన్వయ సమావేశాలు

107views

రిహద్దుల భద్రత గురించి చాలా జాగరూకతతో వ్యవహరించాలని, సరిహద్దుల్లో నివసించే వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని దీనికోసం వివిధ సంస్థలు కలిసి పనిచేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ అన్నారు. రాజస్థాన్ లోని పుష్కర్ లో జరుగుతున్న అఖిల భారతీయ సమన్వయ సమావేశాల సందర్భంగా ఏర్పాటైన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధ్యయన్ పేరుగల సంస్థ రెండేళ్లపాటు మహిళల సమస్యల గురించి అధ్యయనం చేసిందని, వివిధ సంస్థలకు చెందిన మహిళలు ఈ అధ్యయనంలో పాలు పంచుకున్నారని, అధ్యయన నివేదిక ఆధారంగా మహిళా సురక్ష, సాధికారత, గౌరవ మర్యాదలు పెంపొందించడం మొదలైన విషయాలపై ఈ సమావేశాలలో విస్తృతమైన చర్చ జరుగుతుందని శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు.

సంఘ స్వయంసేవకులు 35 కంటే ఎక్కువ సంస్థలలో పనిచేస్తున్నారని, ఇవన్నీ వేరువేరు సంస్థ లేనని, స్వతంత్రమైనవేనని ఆయన తెలియజేశారు. సమన్వయ సమావేశాలలో ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరని, ఆయా సంస్థలకు నిర్ణయాలు తీసుకునే ప్రత్యేక ఏర్పాటు, పద్ధతి ఉంటాయని ఆయన అన్నారు. ఈ సంస్థలకు చెందిన అధికారులు, కార్యకర్తలు దేశం మొత్తంలో పర్యటిస్తూ ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకుంటారు. ఇలా తెలుసుకున్న విషయాలను ఇతర సంస్థల కార్యకర్తలతో పంచుకునేందుకే ఈ సమన్వయ సమావేశాలని శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు. ఈ సమావేశాలలో వివిధ సంస్థలకు చెందిన కార్యనిర్వహణ అధికారులు (అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంఘటన కార్యదర్శి) పాల్గొంటారు. ఈ సమావేశాలలో సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ భయ్యాజీ జోషి, ఇతర అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు కూడా పాల్గొంటారు.

గత ఏడాది మంత్రాలయం (ఆంధ్ర ప్రదేశ్) లో జరిగిన సమావేశాల్లో అన్ని సంస్థలు జల, పర్యావరణ పరిరక్షణ విషయంలో సమాజంలో అవగాహన కలిగించడం, యువ కార్యకర్తలను ప్రోత్సహించడం, సమాజంలో ముఖ్యంగా యువతలో సంస్కారాలను పెంపొందించడం వంటి మూడు రకాల కార్యక్రమాలు ఏడాది మొత్తంలో నిర్వహించాలని నిర్ణయించారని, ఆ మూడు కార్యక్రమాల సమీక్ష ఇప్పటి సమావేశాలలో జరుగుతుందని శ్రీ అరుణ్ కుమార్ తెలిపారు. అలాగే వివిధ జాతీయ విషయాలపైన కూడా చర్చ జరుగుతుందని తెలియజేశారు. కాగా 7/9/2019 శనివారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాలు 9/9/2019 సాయంత్రం ముగుస్తాయని ఈ సందర్భంగా శ్రీ అరుణ్ కుమార్ తెలిపారు.