News

త్యాగ నిరతికి నిదర్శనం రణరంగ చౌక్

37views

స్వేచ్ఛావాయువుల కోసం భారత జాతి తన ఊపిరిని జెండాలా ఎగరవేసిన వేళ తెలుగునేలా దేశభక్తితో ఊగింది. వలస స్వార్థ పాలనపై నిస్వార్థ త్యాగ నిరతి తెగువతో తలపడింది. తూటాలకు తనువులను చాలించడానికైనా సిద్ధమే. కానీ, బానిసత్వ విధానాలకు మాత్రం తలవంచలేదు. ‘ఎక్కడుంది తెనాలి?’ అని బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఆరా తీసేలా…విముక్తి ఉద్యమాన్ని ఆంధ్రులు రగిలించారు. అణచివేత, దమనకాండకు ఎదురొడ్డి ఏడుగురు తమ బలిదానాలతో ఉద్యమాన్ని బతికించుకున్నారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెనాలి పేరును చారిత్రక పుట్టల్లో చేర్చిన ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. బాపూజీ పిలుపు అందుకుని సమర యోధులు అంతా ఉద్యమంలోకి దిగారు. ముంబై సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర్యోద్యమకారులను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెనాలివాసులు పట్టణంలో సమావేశం అయ్యారు. 1942 ఆగస్టు 12వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు, ముఖ్య నేతల అరెస్టుల కారణంగా ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికేలా చేశాయి. ‘క్విట్ ఇండియా’ అంటూ బ్రిటిష్ వారిని ఉద్దేశించి నినదిస్తూ సాగిన ప్రదర్శన స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రభుత్వ అణచివేతపై ప్రజల ఆవేదన ఆగ్రహంగా రూపాంతరం చెందింది. ఫలితంగా రైల్వేస్టేషన్, ఒక రైలు తగులబడ్డాయి. సత్వరమే పరిసర ప్రాంతాల నుంచి తెనాలి చేరిన బ్రిటిష్ బలగాలు ఉద్యమకారులపై లాఠీలు ఝుళిపించాయి. అయినా వెరవక నినాదాలు చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపారు.

తెనాలి రైల్వేస్టేషన్ నుంచి సబ్‌ట్రెజరీ కార్యాలయం వైపు సమూహాలుగా కదులుతున్న ఉద్యమకారులను పాత బస్టాండ్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కాల్పులకు తెగబడ్డారు. అయినా వెరవకుండా తూటాలకు సత్యాగ్రహులు గుండె చూపారు. వారి రక్తంతో పాత బస్టాండ్ ప్రాంతం ఎరుపెక్కింది. ఈ విషాదకర ఘటనలో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. మాజేటి సుబ్బారావు, శ్రీగిరిలింగం, భాస్కరుని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య అమరులయ్యారు.

స్వాతంత్ర్యం వచ్చిన 12 ఏళ్ల తర్వాత అప్పటి మున్సిపల్ ఛైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య అమరవీరుల స్మరణకు ఘటన జరిగిన ప్రాంతంలోనే ఏడు స్తూపాలు, భరతమాత ఒడిలో ఒదిగిన బిడ్డల విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, ఆ ప్రాంతాన్ని ‘రణరంగ చౌక్‌’‌గా నామకరణం చేశారు. కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దామోదరం సంజీవయ్య వంటి ప్రముఖ నేతలు అమరవీరుల స్తూపాలను ఆవిష్కరించారు. అప్పటి నుంచి దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవటానికి మూడు రోజుల ముందే తెనాలిలో స్వాతంత్ర్య వేడుకలు జరుగుతాయి. అమర వీరుల త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 12వ తేదీన అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ రణరంగ చౌక్‌ను ముద్రిస్తూ 2007లో ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేసింది. అమరుల త్యాగనిరతికి, తెనాల ప్రజల దేశభక్తికి, పోరాట పటిమకు, జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తూ రణరంగ చౌక్ ప్రాంతం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.