
ఏ కూతురుకైనా నాన్నే హీరో. అలాంటి నాన్న ప్రాణాలకే ముప్పు ఏర్పడితే.. ఆమె ఎంతకైనా తెగిస్తుంది. గొడ్డలి చేతబూని ‘షీరో’ అవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న అచ్చం ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రిని చంపేందుకు వచ్చిన మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కొంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా ఝురాగావ్‌లో నివసిస్తున్న సోమధర్ కోరం పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, అతన్ని హతమార్చేందుకు మావోయిస్టులు నిర్ణయించారు. సోమవారం రాత్రి 8 మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి ఇంటి వద్ద ఉన్న సోమధర్‌పై ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అక్కడే ఉన్న ఆయన కుమార్తె సులీల వారిని ప్రతిఘటించింది. దాడి చేస్తున్న ఓ వ్యక్తి చేతిలోని గొడ్డలిని లాక్కొని పెడబొబ్బలు పెడుతూ శివంగిలా ఎదురు దాడి చేసింది. దీంతో స్థానికులు పరుగున చేరుకోవడంతో భయపడిన మావోయిస్టులు వెళ్లిపోయారు. సోమధర్ మెడపై గొడ్డలి గాయం కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడుకునేందుకు సులీల చేసిన ధైర్యాన్ని స్థానికులు కొనియాడారు.





