
ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించే వక్ఫ్ బోర్డ్‌ల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ (ఆగస్ట్8న) కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును తీర్చిదిద్దింది.
దీంతో పాటు సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమ వేనని ప్రకటించే వక్ఫ్ బోర్డు ఏకపక్ష అధికారాలకు స్వస్తి పలకనుంది. కాగా, ఒకవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.