ArticlesNews

ప్రాచీన ఆరోగ్యశాస్త్రమే ఆయుర్వేదం

63views

మనిషికి భగవంతుడు ప్రసాదించిన శరీరం ధర్మాచరణ కోసమే అని ప్రాచీనుల ఉపదేశం. ఎన్ని విధాలుగా కృషి చేసైనా మనిషి తన శరీరాన్ని కాపాడుకోవాలే గాని, నాశనం చేసుకోరాదు. శరీర రక్షణకు మార్గాన్ని చూపే ప్రాచీన ఆరోగ్యశాస్త్రమే ఆయుర్వేదం.

ఆయువు నాలుగు విధాలని మునుల వాక్కు మొదటిది సుఖాయువు. శారీరకంగా, మానసికంగా సరైన పద్ధతిలో ఉండటం సుఖాయువు. రెండోది దుఃఖాయువు రోగాలతో కష్టంగా బతుకును ఈడ్వటం దుఃఖాయువు. మూడోది హితాయువు. అంటే సకల ప్రాణుల హితాన్ని కోరడం, చక్కని అలవాట్లు, దానం చేయడం, పూజ్యులను గౌరవించడం వంటివి హితాయువులు. నాలుగోది ఆహితాయువు అందరినీ కరుణతో చూడకుండా, తన స్వార్థం కోసం ఇతరులకు ఇతరులకు హాని తలపెట్టడం

ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరి. ధనువు అంటే శరీరం. దాని అంతరంలో (లోపల) ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకొని, సరైన చికిత్సల ద్వారా దేహాన్ని కాపాడుకోవడమే ఈ పదానికి సరైన నిర్వచనం. స్వర్గలోకవాసులైన దేవతలు అమృతం తాగినవాళ్లే అయినా, వారికీ శారీరక బాధలుంటాయి. శత్రువులతో పోరాటాలు జరిపినప్పుడు వారి శరీరాలూ గాయాలకు, ఇతర బాధలకు గురి అవుతాయి. అందువల్ల బ్రహ్మదేవుడు దేవతల శారీరక రక్షణ కోసం ‘ధన్వంతరి’ని సృష్టించాడని, ఆయన అవసరమైన సమయాల్లో దేవతలకు చికిత్సలు చేసేవాడన్నది శాస్త్ర ఉపదేశం. ధన్వంతరి సాక్షాత్తు విష్ణువు అంశతో జన్మించాడని, క్షీరసాగరమథన సమయంలో అవతరించాడనీ బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. ధన్వంతరి సకలమంత్ర, తంత్ర శాస్త్ర విశారదుడని. గరుత్మంతుడి శిష్యుడని, శంకరుడి అనుగ్రహంతో మహిమోపేతుడై లోకాలను కాపాడుతున్నాడనీ ప్రాచీన శాస్త్ర వచనం.

పూర్వం మానవుల హృదయకోశ, శ్వాసకోశ, గర్భకోశాలను, వివిధ నాడుల సంచారాన్ని చక్కగా పరిశీలించి చికిత్సలు చేసేవారని పెద్దల ద్వారా తెలుస్తోంది. శల్య, శాలక్య, కాయ, అగద, కౌమారభృత్యం, రసాయనం, వాజీకరణం వంటివి ఆయుర్వేదంలో కొన్ని చికిత్సా విధానాలు.ప్రకృతిలో అమూల్య వనరులైన తీగలు, పువ్వులు, చెట్లు, దుంపలు, కాయలు, లోహాలు, తైలాలు, ప్రాణుల శరీర రక్షణకు తోడ్పడతాయన్నది మునుల మాట. ప్రాచీన కాలం నుంచి ఎందరో మునులు తమ పరిశోధనల ద్వారా సాధించిన ఫలితాలను శాస్త్ర గ్రంథాల రూపంలో లోకానికి అందించి, ఎంతో ఉపకారం చేశారు.

రోగపరీక్ష మొదట జరగాలని, ఆ తరువాత దానికి అనుగుణంగా ఔషధాలను ఇవ్వాలని, వైద్యుడికి ఆరోగ్యశాస్త్రంపై పూర్తి అవగాహన ఉండాలనీ చరకసంహిత చెబుతోంది. వైద్యుడు అందరిపట్ల మైత్రిని, కరుణను కలిగి ఉండాలని, రోగులను సహానుభూతితో పరీక్షించి, చికిత్స చేయాలని, ఇలా వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. భగవద్గీతలో సైతం యుక్తాహారం, యుక్త విహారం, యుక్తమైన నిద్ర ఒక యోగమని కృష్ణుడు బోధించాడు. శాస్త్రాల్లోని సూచనలు పాటిస్తూ, నియమపూర్వకంగా ఉంటే, మనిషి నూరేళ్లు బతుకుతాడనే మాట నిత్యసత్యం!