News

వయనాడ్‌లో మీ సేవలకు బిగ్‌ సెల్యూట్‌ : సైన్యానికి చిన్నారి లేఖ

67views

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం తర్వాత వెంటనే సహాయక చర్యల్లోకి దిగిన భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, అటవీశాఖ బృందాలు మట్టి దిబ్బల్లో, కొండ చరియల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. వీరికి దేశంపై ఉన్న ప్రేమ, పనిలో నిబద్ధతను చూసి ఓ చిన్నారి వారికి లేఖ రాశాడు. ఈ లేఖకు ఆర్మీ స్పందించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వయనాడ్‌కు చెందిన 3వ తరగతి విద్యార్థి భారత ఆర్మీకి లేఖ రాస్తూ ‘ప్రియమైన ఇండియన్‌ ఆర్మీ.. నా జన్మ స్థలం వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతో మంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడటం చూశా. ఆహారం లేకపోయినా బిస్కెట్లు తింటూ సరిపెట్టుకుంటున్నారు. బాధితులను కాపాడటానికి వంతెనలు నిర్మిస్తున్నారు. ప్రజల ప్రాణాల కోసం మీరు శ్రమిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. నేను ఏదో ఒక రోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తా’ అని రాసుకొచ్చాడు. బాలుడి లేఖను అందుకున్న ఆర్మీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణవల్ల తాము దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలనే ఇష్టం పెరుగుతుందని పేర్కొంటూ.. బాలుడి లేఖను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.