News

ఆగస్టులో గరుడవాహనంపై రెండుమార్లు శ్రీ మలయప్ప స్వామి విహారం

241views

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆగస్టులో రెండుమార్లు గరుడవాహనసేవ జరగనుంది. ఆగస్టు 9న గరుడ పంచమి, ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.

గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో మలయప్పస్వామి ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతీ ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ‘‘గరుడపంచమి” పూజలో నూతన దంపతులు పాల్గొంటే వారి వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుందని నమ్మకం. గరుడునిలాగా బలశాలి, మంచి వ్యక్తిత్వం ఉన్న సంతానం కల్గుతుందని విశ్వాసం.

ప్రతీ నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే గరుడసేవను ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.