News

సంస్కార భారతి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు

76views

గురువులు త్రిమూర్తి స్వరూపులని సంస్కార భారతి ప్రకాశం జిల్లా శాఖ ప్రముఖ్‌ పత్తి రంగమన్నార్‌ పేర్కొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో నటరాజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాటకరంగ గురువు కళా ప్రకాశం అధ్యక్షుడు చిట్టా వెంకట శివప్రసాద్‌, సాహిత్య గురువు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కూచిపూడి నృత్య గురువు నళినీ ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్‌ అధ్యక్షురాలు ఎస్వీ శివకుమారి, సంగీత గురువు స్వరరాగ సుధ వ్యవస్థాపక కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసమూర్తి, భగవద్గీత శిక్షణ గురువు చేవూరి విజయలక్ష్మికి పాద పూజ చేసి, ఘనంగా సత్కరించారు. నేటి తరానికి గురువు ప్రాధాన్యతను తెలియజెప్పాలనే ఉద్దేశంతో సంస్కార భారతి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని రంగమన్నార్‌ కొనియాడారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా ప్రముఖ్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ ప్రసాద్‌, రిటైర్డ్‌ లెక్చరర్‌ చిరంజీవి, కోటీస్‌ మాల్‌ అధినేత కోటి సూర్య నారాయణ, సంస్కార భారతి నిర్వాహకులు ఘోరకవి సంపత్‌ కుమార్‌, రామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నటరాజస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, శాసీ్త్రయ సంగీత విభావరి ఆహూతులను అలరించింది.