
ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ సంస్థతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని వచ్చే నెలలో అప్పగించనున్నారు. సెప్టెంబరు 20న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానికదళం ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాకు అప్పగించనున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఇందుకోసం రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ ధనోవా ఫ్రాన్స్‌లోని బోర్డేయాక్స్ నగరంలో విమాన తయారీ ప్లాంటుకు వెళ్లనున్నారు. ఇక్కడ వీరికి తొలి విమానాన్ని అప్పగించనున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విమానాలు వచ్చే ఏడాది మే నుంచి పూర్తి స్థాయిలో భారత్‌కు రానున్నాయి. రక్షణ అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ 2016లో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్ వినియోగిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానాల కన్నా ఆధునికమైనవి కావడంతో భారత వాయుసేన పైలట్లకు దీనిపై శిక్షణ ఇస్తున్నారు. బ్యాచ్‌ల వారీగా పైలట్లను ఫ్రాన్స్‌కు పంపి వచ్చే ఏడాది మే నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. భారత్‌కు అందే రఫేల్ విమానాల విషయంలో మరింత ఖర్చుతో మన దేశ పరిస్థితులకు తగ్గట్లుగా అదనపు ఫీచర్లను జోడిస్తున్నారు. రఫేల్ విమానాల స్క్వాడ్రన్‌లను హరియాణాలోని అంబాలా, బంగాల్‌లోని హషిమరా వైమానిక స్థావరాల్లో మొహరించే అవకాశం ఉందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.