News

అధికార పార్టీ అండతో రౌడీయిజం.ప్రతిఘటించిన హిందూ సంస్థలు

677views

చిత్తూరు జిల్లా వి కోటలో హిందూ ముస్లిముల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆగష్టు 15న మొదలైన ఉద్రిక్తత నేటికీ కొనసాగుతోంది. ఆగష్టు 15న జిలానీ అనే వ్యక్తికి చెందిన ‘రైతు చికెన్ సెంటర్’ పేరు గల చికెన్ షాపు తెరిచి ఉండడం చూసిన కృష్ణ, ఈశ్వర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు “ఆగష్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 లలో మద్యము, మాంసము విక్రయించ కూడదు కదా? మీరెందుకు ఈరోజు షాపు తెరిచి ఉన్నారు?” అని ప్రశ్నించారు. అందుకు జిలానీ కొంత దురుసుగా సమాధానమిచ్చాడు. దాంతో ఆ ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విషయాన్ని లైట్ తీసుకుని “మేము షాపు మూయిస్తాము మీరు వెళ్ళండి” అని వారిని స్టేషన్ నుంచి పంపివేశారు. వారు కేసు నమోదు చేసుకోమని అభ్యర్ధించినా పోలీసులు వినిపించుకోలేదు.

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడొకరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి పోలీసులు కేసు నమోదు చేసుకోని విషయాన్ని వెల్లడించారు. దాంతో ఎస్పీ సదరు చికెన్ షాపు యజమానిపై కేసు నమోదు చేయించవలసిందిగా డీఎస్పీని ఆదేశించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చికెన్ షాపు యజమాని జిలానీని స్టేషన్ కు పిలిపించారు. అలాగే ఉదయం ఫిర్యాదు చేయడానికి వచ్చిన కృష్ణ, ఈశ్వర్ రెడ్డి ఇరివురిని కూడా స్టేషన్ కు పిలిచారు. దాంతో కృష్ణ, ఈశ్వర్ రెడ్డి ఇద్దరూ కొందరు స్నేహితులు, బీజేపీ నాయకులతో కలిసి స్టేషన్ కి చేరుకున్నారు. ఈ లోపు విషయం తెలుసుకున్న ముస్లిములు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు షుమారు 200 మంది స్టేషన్ ఎదుట గుమికూడారు. కంప్లైంట్ ఇచ్చి వెనక్కు మరలిన కృష్ణ, ఈశ్వర్ రెడ్డి బృందానికి వెలుపలికి దారివ్వకుండా ముస్లిములు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకోగా పోలీసులు వారి అడ్డు తొలగించి పంపే ప్రయత్నం చేశారు. ఇంతలో గుంపులోని కొందరు కృష్ణ, ఈశ్వర్ రెడ్డి బృందంపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. వారిలో శివ, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్లోని ఎస్సై తదితరులు వారిని విడిపించి స్టేషన్లో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో “మీరు పొద్దునే కేసు నమోదు చేసుకుని ఉంటే ఇంత గొడవ అయ్యుండేది కాదు కదా?” అని బీజేపీ నాయకులు పోలీసులను నిలదీసినట్టు సమాచారం. బీజేపీ నాయకుల డిమాండ్ మేరకు దాడి చేసిన వారిలో వారు గుర్తించిన 10 మందిపై కేసు నమోదు చేసి వారిలో ఒక నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఆగ్రహించిన హిందువులు, బీజేపీ వర్గాలు 16 వ తేదీన పెద్దఎత్తున వీకోటకు తరలివస్తుండగా వీకోట, పలమనేరు, చిత్తూరు వంటి పలుచోట్ల బీజేపీ నాయకులు శ్రీనివాస్, ఆనంద నాయుడు, నాగభూషణం శెట్టి, వెంకటేష్, భాస్కర్, భానుప్రకాశ్ రెడ్డి, చంద్రా రెడ్డి, ప్రభాకర్, నక్కా రామచంద్రయ్య, ఉమాపతి, చల్లపల్లి నరసింహారెడ్డి, పులి రెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి, ఎల్లంపల్లి ప్రశాంత్, సూరికిరణ్, నిమ్మనపల్లి పురుషోత్తం, సామంచి శ్రీనివాస్, రమేష్ నాయుడు, యామిని శేఖర్ నాయుడు, బుడ్డా చంద్రా రెడ్డి, భగ్గిడి గోపాల్, బాలాజీ యాదవ్, ఆనంద్ యాదవ్ తదితరులను అరెస్టు చేసి చిత్తూరు జిల్లాలోని పలు స్టేషన్లకు తరలించారు. వీకోటలో 144 సెక్షన్ విధించారు. చిన్నగా కొంత పరిస్థితులు శాంతించిన తర్వాత 20/8/19 మంగళవారం నాడు 144 సెక్షన్ ను తొలగించారు.

ఈ నేపధ్యంలో ముస్లిముల యొక్క దుందుడుకు వ్యవహార శైలిపైనా, వైఎస్సార్సీపీ హిందూ వ్యతిరేక వైఖరిపైనా, పోలీసుల పక్షపాత వైఖరిపైనా హిందువులలో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీకోటలో 144 సెక్షన్ ఉండడంతో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకకు చెందిన ఒక గ్రామంలో వైఎస్సార్సీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు షుమారు 300 మంది సమావేశమై జరిగిన సంఘటనపై చర్చించినట్లు తెలుస్తోంది. వీకోట మరియు చుట్టూ ప్రక్కల గ్రామాలలో సైతం ముస్లిములు హిందువుల పట్ల దుందుడుకుగా ప్రవర్తిస్తున్నారని, అనేక విధాలుగా అవమానిస్తున్నారని, వివిధ దుకాణాలకు కొనుగోలు నిమిత్తం వచ్చే హిందూ మహిళల పట్ల కూడా అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని అత్యధికులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.

ముస్లిముల, వైఎస్సార్సీపీ కార్యకర్తల దూకుడుకు కళ్ళెం వెయ్యాలని, ఇందు కోసం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వీలైనంత వరకు ముస్లిములకు చెందిన దుకాణాల్లో కొనుగోలు చెయ్యకుండా ఉండమని హిందువులందరికీ విన్నవించాలని, వీలైనంత త్వరలో చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో సమావేశాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ చైతన్యవంతం చెయ్యాలని నిర్ణయించారట. ధార్మిక సంస్థల ప్రతినిధులని, స్వామీజీలని ఆహ్వానించి వీకోటలో 10 వేల మందితో ఒక పెద్ద హిందూ సమ్మేళనాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా భోగట్టా.

ఏదేమైనా మొన్న టీటీడీ డీయీవో విషయంలో అయితేనేమి, శ్రీశైలం ఈవో విషయంలో అయితేనేమి, ఇప్పుడు వీకోట అయితేనేమి, వివిధ ప్రదేశాలలో జరుగుతున్న వివిధ పరిణామాల నేపధ్యంలో పరిశీలిస్తే రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా హిందూ సమాజం మునుపట్లా కాకుండా చాలా చురుగ్గా స్పందిస్తూ వుండడం, సంఘటితంగా ఎదుర్కుంటూ వుండడం కనిపిస్తోంది.