NewsProgramms

శ్రీశైలంలో కదం తొక్కిన కాషాయ దళం

558views

శ్రీశైలం దేవస్థానం నిర్మించిన లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో షాపుల కేటాయింపు కోసం దేవస్థానం వారు నిర్వహించ తలపెట్టిన వేలంలో పాల్గొనడానికి కొందరు ముస్లిం మతస్థులు దరఖాస్తు చేసుకోవడం, దానిపై హిందూ సంస్థలు అభ్యంతరం వెలిబుచ్చటం, స్థానిక భాజపా నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అరెస్టు వంటి పరిణామాల నేపధ్యంలో రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వుండడం తెలిసిందే. ఈ పరిణామాలన్నిటి మధ్యా ఈ వివాదమంతటికీ కేంద్ర బిందువైన ఈవో శ్రీరామచంద్ర మూర్తిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా మనకు తెలిసిందే.

ఈ కారణంగా 20/8/19 బుధవారం నాడు శ్రీశైలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆ పిలుపుననుసరించి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది హిందూ సంస్థల కార్యకర్తలు బయలుదేరారు.  ఈ నేపధ్యంలోకర్నూలు జిల్లాలోని దాదాపు 200 మంది హిందూ సంస్థల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంస్థలలో పని చేస్తున్న కీలకమైన కార్యకర్తలు పలువురిని శ్రీశైలంలో హిందూ ధర్మ రక్షా సమితి తలపెట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొనవద్దని కూడా హెచ్చరించారు.

అన్ని అవాంతరాలను దాటుకుని హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు శ్రీశైలం చేరారు. ఈ నేపధ్యంలో పోలీసులు స్వామీజీలను అరెష్టు చేశారు. భక్తులు ప్రతిఘటించడంతో కొద్దిసేపటికి విడిచిపెట్టారు. ఈ సమయంలో ఎవరో ఒక అగంతకుడు ఒకానొక భక్తుడిపై దాడి చేయడంతో నిరసనకారుల ఆగ్రహం మిన్నుముట్టింది. భక్తులందరూ పోలీసులకు, ప్రభుత్వానికి, ఈవోకి వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేస్తూ ముందుకురికారు. అరెష్టు చేసిన భక్తులను పోలీసులు అన్య మతస్తులకు చెందిన వాహనాలలోనే తరలించజూడడం కూడా భక్తుల ఆగ్రహానికి కారణమైంది. హిందూ సంస్థల నాయకులు భక్తులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.

హిందూ సంఘాల సమావేశంలో శివ శక్తి నాయకులు శ్రీ కరుణాకర్ సుగ్గుణ, ఎస్.సి, ఎస్.టి హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ శ్రీశైలం,శివస్వామి తదితరులు ఒక వినతి పత్రాన్ని రూపొందించారు.

  • దేవస్థానం పరిధిలోని అన్య మతస్థుల దుకాణాలు తొలగించాలని,
  • ప్రసాదాల తయారీలో పాలు పంచుకుంటున్న అన్య మతస్థులను ఆ విధుల నుంచి తొలగించాలని,
  • దేవస్థానం అధ్వర్యంలో నడిచే గోశాలను పర్యవేక్షిస్తున్న అన్య మతస్తురాలిని ఆ విధుల నుంచి తప్పించాలని,
  • అంతే కాకుండా వివిధ స్థాయిల్లో, స్థానాల్లో ఉన్న అన్య మతస్తులందరినీ తొలగించడం తోపాటుగా, ఇక ముందు కూడా ఏ స్థాయిలోనూ అన్య మతస్థులను దేవాలయ కార్యకలాపాలలోకి అనుమతించకుండా నిబంధనలను కఠినతరం చెయ్యాలని,
  • శ్రీశైలం దారి పొడవునా వ్రాయబడి ఉన్నఅన్య మతాలకు చెందిన వ్రాతలను తొలగించాలని,
  • క్రొత్తగా నిర్మించిన శ్రీ లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపులను హిందువులకు మాత్రమే కేటాయించాలని, ఇలా మరికొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వివాదాస్పద ఈవో శ్రీరామచంద్ర మూర్తి స్థానంలో నియుక్తి చేయబడిన క్రొత్త ఈవో శ్రీ రామారావుకు  సమర్పించారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఆద్యంతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు, హిందూ సంఘాల నాయకుల సంయమనం కారణంగా పెద్ద గందరగోళం చెలరేగకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమం ముగిసింది.