ArticlesNews

హిందూ ద్వేషులారా! ఒక్క క్షణం ఆలోచించండి.

890views

దేవుణ్ణి మొక్కడం విశ్వాసం. నువ్వు చెయ్యాల్సింది చేసి దేవుడి మీద భారం వెయ్యి. మిగిలినది దేవుడే చూసుకుంటాడు. అని పెద్దలు చెప్తారు. మేము దాన్ని నమ్ముతాం. మానవ ప్రయత్నమెంత వున్నా, దానికి దైవ సంకల్పం, కృప కూడా తోడు కావాలన్నది మా నమ్మకం. మీరు నమ్మకపోవచ్చు. కానీ మా నమ్మకాలను అవహేళన చెయ్యకూడదు కదా? అడుగడుగునా అవమానాలతో, అవహేళనలతో, అహేతుక విమర్శలతో విసిగిపోయాం.

ఒక్క నిముషం గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీరేం చేస్తున్నారు? “గోవు మాకు తల్లి” అని మేమంటాం. అంటే మీ నాన్న ఎద్దా? అంటాడొకడు. “అతి చిన్న అణువులో, పరమాణువులో అంతర్గతంగా చైతన్య శక్తి దాగి ఉంటుంది” అని సైన్సు కూడా అంగీకరిస్తుంది. మేము కూడా రాయిలో, రప్పలో దాగివున్న అనంత చైతన్య శక్తే విశ్వమంతా నిండి ఉన్నదని నమ్ముతున్నాం. ఒక చిన్న పరమాణువులో ఏ స్వరూపము (కేంద్రకము, దీర్ఘ వృత్తాకార కక్ష్యలు) ఉంటుందో విశ్వమంతా అదే స్వరూపము, ఆకృతితో ఉంది. దానినే అండ, పిండ, బ్రహ్మాండములు అన్నారు మన పెద్దలు. అందుకే మేము రాతిలో ఇమిడివున్న చైతన్య శక్తిని (జీవాత్మని) ఆరాధిస్తాం. కానీ మీరు రాళ్ళను పూజించే అనాగరికులంటాడొకడు.

ఏడాదికొకసారి మా పండగొస్తుంది. మీ పండగ వల్లే పర్యావరణం నాశనమైపోతోందంటూ రోదన మొదలు. అరె ఏడాది పొడవునా పరిశ్రమల ద్వారా, వాహనాల ద్వారా, మన ఇళ్ళ నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల జరిగే కాలుష్యం మాటేమిటి? ప్రకృతి హితాన్ని మరచి మనం విచ్చలవిడిగా పోగేస్తున్న వ్యర్ధాల మాటేమిటి? మా పండుగ నాడే ప్రకృతి హితం గుర్తుకొస్తుంది కొందరికి. దానికి కోర్టులు, చట్టాలు అబ్బో ఎన్ని దెబ్బలు కొట్టారో?

దేన్నయినా దేవునికి నివేదించి, దానిని తిరిగి దైవ ప్రసాదంగా భావించి స్వీకరించటం మాకు అలవాటు. బలులు అలాంటివే. వందల, వేల సంఖ్యలో కసాయి అంగళ్ళలో హతమైపోతున్న మూగజీవాల గురించి ఎవరికీ ఆందోళన లేదు. ఆ మాంసం తింటే తప్పులేదు. అదే దేవునికి బలిచ్చి తింటే తప్పు, అనాగరికం. అదే సాయిబులు హలాల్ చేసుకుని, కోసుకుని తింటే తప్పులేదు. ఎవరూ దాని గూర్చి పల్లెత్తు మాటనరు. అదే మా బలులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. సినిమాల్లో, టీవీల్లో ఇదంతా అనాగరికమని పని గట్టుకుని ప్రచారం చేస్తారు. మళ్ళీ కోర్టుల ప్రవేశం. న్యాయమూర్తుల ఏకపక్ష తీర్పులు. దీని వెనుక హిందూత్వాన్ని క్షీణింపజేసే అంతర్జాతీయ కుట్ర దాగివున్నదంటాను నేను. తెలిసో, తెలియకో ఆ ప్రచారంలో పాలు పంచుకున్న, పంచుకుంటున్న వారందరూ ఆ కుట్రలో భాగాస్వాములేనంటాను.

అనుక్షణం చుట్టూ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. మనసు నొచ్చుకుంటోంది. మా మనోభావాలతో ఎవ్వడికీ పని లేదు. మా విశ్వాసాలను గౌరవించాలన్న కనీస ఇంగితం లేదు. ఎవరి ఆచారాలను, సాంప్రదాయాలను వారు స్వేచ్చగా ఆచరించగలిగినపుడే లౌకిక రాజ్యం సాకారమవుతుంది. అను క్షణం ఒక వర్గపు విశ్వాసాలను అవహేళన చేస్తూ కించపరచడం ద్వారా కాదు. యూ ట్యూబ్ లో చూడండి. అన్య మతస్థుల వికృత విన్యాసాలు కనిపిస్తాయి. మేథావులెవరూ వాటి మీద నోరు మెదపరే? హిందువులు గతంలోలా తోలు మందం గాళ్ళు కాదు. చాలా సెన్సిటివ్ గా తయారయ్యారు. మా విశ్వాసాలను, మనోభావాలను గౌరవిస్తేనే ఎవరికైనా మనుగడ. లేకపోతే గుర్తింపు లేకుండా పోతారు. దీనిని మమ్మల్ని అవమానించేవాళ్ళు గ్రహించటం లేదు. నిజానికి అలాంటి హిందూ వ్యతిరేకుల్ని హిందూ సమాజం పట్టించుకోవడం మానేసి చాన్నాళ్ళయింది. మాకు కిరీటాలు పెట్టమని మేము వేడుకోవటం లేదు. మమ్మల్ని అనుసరించమని కూడా మేము చెప్పటం లేదు. కేవలం మమ్మల్ని మాలా బ్రతకనివ్వండి చాలంటున్నాం. మమ్మల్ని అవహేళన చెయ్యొద్దంటున్నాం. మమ్మల్ని మనసున్న మనుషులుగా గుర్తించమంటున్నాం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.