News

మణిపూర్ లో శాంతి కోసం కృషి చేయాలి : డా.మోహన్ భగవత్

135views

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు ఇటీవల రెండు పోలీస్‌ అవుట్‌ పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతో పాటు స్థానికుల 70 ఇళ్లను తగలబెట్టారు. మరోవైపు.. కాంగ్‌పోక్పి జిల్లాలో సీఎం భద్రత కాన్వాయ్‌పై సాయుధులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే మణిపూర్ పరిస్థితులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోవాలని, హింసను అరికట్టాలని కోరారు.

‘‘పదేళ్ల క్రితం మణిపూర్‌లో శాంతియుత పరిస్థితులు ఉండేవి. తుపాకీ సంస్కృతి ముగిసినట్లు అనిపించింది. కానీ, ఒక్కసారిగా హింస చెలరేగింది. ఏడాది గడిచినా శాంతి నెలకొనలేదు. సమాజంలో ఘర్షణలు మంచివి కావు. శాంతిస్థాపన కోసం మణిపూర్‌ ఏడాది కాలంగా ఎదురుచూస్తోంది. అక్కడ హింసను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను ప్రభుత్వాలు ప్రాధాన్యంతో పరిష్కరించాలి’’ అని నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భగవత్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల వాతావరణం నుంచి బయటపడి.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని పాలకులకు సూచించారు.