ArticlesNews

హిందూ జెండా మన బిర్సా ముండా

75views

( జూన్ 9 – బిర్సా ముండా బలిదానం జరిగిన రోజు )

భారతదేశంలో వనవాసీ మూలాలను నాశనం చేయడానికి సాహసించిన సిద్ధాంతం మీద ఆయన తిరుగుబాటు చేశారు. ఆయనే ధర్తీ ఆబాగా ప్రఖ్యాతుడైన ముండా తెగ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా. ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఉల్నిహాతు గ్రామంలో కర్మీముండా, సుగానా దంపతులకు 1875 నవంబర్ 15న బిర్సా ముండా జన్మించారు. బిర్సా పుట్టగానే ధరితీ కా ఆభా అంటే భూ దేవతగా చెప్పుకున్నారు.బిర్సా వనవాసీలలో ఉండే మూఢనమ్మకాలూ, ఆనాచారాలు పారద్రోలాడు. తపస్సు, ధ్యానంతో గురువుగా, స్వామిజీగా మారి తన తెగవారికి భగవానుడయ్యాడు.

క్రైస్తవ మతమార్పిడీలను వ్యతిరేకిస్తూనే మరోవైపు కుంతి, తామర్, బసియా, రాంచి ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకొని ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్‌లో ఉల్ గులాన్ పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రాచీన సాంస్కృతిక పరంపర పట్ల వనవాసీలలో స్వాభిమానం రేకెత్తించారు. స్వాతంత్ర్యం కావాలని వనవాసీలకు దిశానిర్దేశం చేస్తూనే ప్రాచీన హిందూత్వ ప్రతీకలని ఆదర్శంగా చేసుకొని వనవాసీలకు తులసి పూజ, తిలక ధారణ, యజ్ఞోపవీత ధారణ అలవాటు చేశారు. విద్య, వైద్యం, శుచీశుభ్రత నేర్పారు.

బిర్సా సాగిస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిషర్లు వ్యూహాలను తీవ్రతరం చేశారు. 1900 మార్చి 3 అర్థరాత్రి బిర్సాను పోలీసులు బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. రక్తపువాంతులతో వైద్యం అందక 1900 జూన్ 9న ఆంగ్లేయుల దాష్టికానికి బిర్సా బలయ్యారు. ధర్మం, సంస్కృతుల రక్షణ కోసం, వనవాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా చేసిన పోరాటం అభినందనీయం, ఆదర్శనీయం. ఆయన స్ఫూర్తితో గ్రామాల్లో, తండాల్లో, పట్టణాల్లోని వనవాసీలను చైతన్య పరచాలి. ఇదే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.