ArticlesNews

మూడు రోజుల పాటు జరగనున్న మోదకొండమ్మ ఉత్సవాలు

115views

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ రోజు నుంచి 11 తేదీ వరకు శక్తిస్వరూపిణి.. మన్యం దేవత మోదకొండమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. పరవశించిపోయే ప్రకృతి మధ్య మోదకొండమ్మ దేవికి ఏటా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పాడేరులో పినవేనం రాతి గుహ వద్ద స్వయంభువుగా కొలువుదీరిన మోదకొండమ్మ దేవి ఉత్సవాలంటే అడవంతా అంబరాన్నంటే సంబరం.

మోదం అంటే సంతోషం. భక్తులకు సుఖ సంతోషాలను ప్రసాదించే తల్లి మోద కొండమ్మగా విశ్వసిస్తారు స్థానిక ప్రజలు. కోరిన కోర్కెలు తీర్చే కొగుబంగారం పాడేరు గిరిజన దేవత మోదకొండమ్మ మోద కొండమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని సతకంపట్టు పందిరి కింద కొలువు తీర్చనున్నారు.

అంగరంగ వైభవంగా జరిగే ఈ జనజాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా సుదూర తీరాల నుంచి భక్తులు రానున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి, మేళతాళాలతో అమ్మవారి ఘటాలను నిలబెట్టి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఇంతటి విశిష్టత కలిగినది కనుక రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మోద కొండమ్మ జాతరను గిరిజన జాతరగా గుర్తించింది.