
పంజాబ్‌లో మరోసారి వేర్పాటువాద ఖలిస్థాన్ అంశం తెరపైకి వచ్చింది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్ బ్లూస్టార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అక్కడ భారీ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న వివిధ సంస్థల కార్యకర్తలు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. హత్యకు గురైన తీవ్రవాదులు జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే, హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలను ప్రదర్శించారు. స్వర్ణదేవాలయంలోని అకాల్ తఖ్త్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రదర్శనకారుల నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. మాజీ ఎంపీ ధియాన్ సింగ్ మంద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనకారులను ఉద్దేశించి అకాల్ తఖ్త్ అధినేత జ్ఞానీ రఘువీర్ సింగ్ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రులుగా పంజాబ్ నుంచి గెలిచిన అమృత్‌పాల్ సింగ్, సరబ్‌జీత్ సింగ్.. చాలా కాలంగా జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీల విడుదలకు పార్లమెంటులో తమ గళం వినిపించాలని ఆయన కోరారు.





