ArticlesNews

తియానన్మెన్ స్క్వేర్ నరమేధానికి 35 ఏళ్లు

70views

(జూన్ 4 – తియానన్మెన్ స్క్వేర్ నరమేధం జరిగిన రోజు )

జూన్ 4, 1989న, బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో చుట్టుపక్కల వేలాది మంది శాంతియుత నిరసనకారులపై చైనా దళాలు ముప్పేట దాడి జరిపి అమానుషంగా చంపాయి. వేల మంది జైలు పాలయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత గత 35 సంవత్సరాలుగా చైనా ప్రధాన భూభాగంలో కనీసం ఈ దుర్దినాన్ని స్మరించుకోవడాన్ని సహితం నేరంగా పరిగణిస్తూ వస్తున్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత అమానుష సంఘటనలలో ఒకటిగా చెప్పుకోదగిన తియానన్మెన్ ఊచకోత సామూహిక హత్యలను చైనా ప్రభుత్వం గుర్తించి, బాధ్యత వహించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ హక్కుల సంస్థలు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

ఏప్రిల్ 1989లో బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్, ఇతర చైనీస్ నగరాల్లో విద్యార్థులు, కార్మికులు, ఇతరులు శాంతియుతంగా సమావేశమై అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మే 1989 చివరిలో తీవ్రరూపం దాల్చిన నిరసనలకు ప్రభుత్వం స్పందించి యుద్ధ చట్టాన్ని ప్రకటించింది. కానీ నిరసనలను నిరంకుశంగా అణచివేయగలిగారు. జూన్ 3, 4 తేదీలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు శాంతియుత నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారు.

చైనీస్ అధికారులు ఈ రోజుల్లో తియానన్మెన్‌లో ఏమి జరిగిందో ప్రస్తావించడాన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఇది మార్క్సిస్ట్- లెనినిజానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు. కమ్యూనిష్టు పార్టీ పునాదులను కదిలించిన ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. జూన్ 4వ తేదీ సమీపిస్తుందంటే ఉన్నట్లుండి చైనా ఇంటర్నెట్ మాధ్యమాల్లో అప్రకటిత సెన్సార్‌షిప్ ప్రారంభం అవుతుంది. అయితే ఏదో ఒక రోజు చైనా ప్రభుత్వం తన చరిత్రలోని ఈ భాగాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.