News

రామమందిర నిర్మాణానికి బంగారు ఇటుక ఇస్తా – మొఘల్ వారసుడు టూసీ.

194views

“నాకే గనుక అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మశీదు వివాదాస్పద భూమి అప్పగిస్తే రామమందిర నిర్మాణానికి పునాది రాయిగా బంగారు ఇటుకను ఇస్తాను” అని అన్నదెవరో తెలుసా? హైదరాబాద్ లో నివసిస్తున్న మొఘల్ వారసుడు 50 ఏండ్ల వయసుగల హబిబుద్దిన్ టూసీ. ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్షా జాఫర్ కు ఆరవ తరం వారసుడినని చెబుతున్న టూసీ తనకే గనక ఆ స్థలాన్ని అప్పగిస్తే ఆ స్థలమంతా రామమందిర నిర్మాణానికి అప్పగిస్తానని, పునాదికై తొలి ఇటుకగా బంగారు ఇటుకను సమర్పిస్తానని చెప్పారు. గత సంవత్సరం సెప్టెంబరులో సైతం ఆయన ఈ విధంగానే ప్రకటన చేశారు.

రామజన్మ భూమి – బాబ్రీ మశీదు వివాదాస్పద స్థలంపై నడుస్తున్న కేసులో తనను కూడా భాగస్వామిగా పరిగణించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఈ పిటిషన్ పై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. “ఈ స్థలానికి యజమానిగా నిరూపించే ఆధారాలు ఏ ఒక్కరి వద్దా లేవు. కానీ మొఘలు పాలకుల వారసుడిగా ఈ స్థలం ఎవరికి చెందాలో చెప్పే హక్కు తనకుంద”న్నారు. ఫిబ్రవరి 8న ఆయన పిటిషన్ దాఖలు చేశారు. డిల్లీలోని ఆయన తరపు న్యాయవాది ప్రవీణ్ కుమార్ టైంస్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఈ కేసులో మరే పిటిషనూ అంగీకరించటం లేదని, అయితే దానర్ధం ఈ పిటిషన్ త్రోసిపుచ్చినట్లు కాదని చెప్పారు.

బాబరు 1529లో మశీదు నిర్మించాడని, అది కేవలం తమ సైనిక దళాలు నమాజు చెయ్యడానికే గానీ ఇతరుల కోసం కాదన్నాడు. మశీదు నిర్మాణానికి ముందు ఆ స్థలంలో ఏమి ఉండేదన్న అంశం జోలికి తాను పోదలచుకోలేదని, హిందువులు ఆ స్థలం రాముడి జన్మభూమిగా భావిస్తున్నందున ఒక నిజమైన ముస్లింగా ఇతరుల మనోభావాలను గౌరవిస్తానని టూసీ అన్నారు.

ఆగష్టు 14న సుప్రీంకోర్టు ఆ స్థలంలో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో రామ మందిరం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయని తెలియజేసింది. తన వద్ద సైతం యాజమాన్యపు హక్కులు నిర్ధారించే డాక్యుమెంట్లు లేనప్పటికీ మొఘలు వారసుడిగా తనను ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవాల సందర్భంగా తాజ్ మహల్ లోని సెల్లార్ ద్వారాలను తెరవడానికి  ఆహ్వానిస్తారని, ఆ హక్కుతోనే తాను ఈ అభిప్రాయం చెబుతున్నానని టూసీ అన్నారు.