News

భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు

89views

తిరుమలలో భక్తుల రద్దీ ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేస‌వి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా శిలాతోర‌ణం, బాట గంగ‌మ్మ గుడి, మార్గ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం క్యూలైన్లలో ఉన్న భ‌క్తుల సౌక‌ర్యార్థం 27 ప్రాంతాల్లో తాగునీరు, 4 ప్రాంత‌ల్లో అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నారు.

భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం అక్టోప‌స్ భ‌వ‌నం నుండి శిలాతోర‌ణం వ‌ర‌కు ప్ర‌త్యేకంగా 8 బ‌స్సులు ఏర్పాటు చేసి ప్ర‌తి నిమిషానికి భ‌క్తుల‌ను చేర‌వేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 60 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 50 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు. అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వ‌ర‌కు శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్ధు చేసింది.