ArticlesNews

మూలాల విస్మరణే మన నీటి సమస్యలకు మూలం

Cover / Wallpaper Design
266views

గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ !

కావేరీ యమునా రేవా కృష్ణా గోదా మహానది !!

ఇలా ప్రతి నిత్యమూ మనం నదులను తలుస్తాం. మన దేశంలో నదిని తల్లిగా భావించి పూజిస్తాం. అందుకే నదులను గంగమ్మ, కృష్ణమ్మ, కావేరమ్మ, గోదారమ్మ అని పిలుచుకుంటాం మనం. ఒక్క నదులనే కాదు

“రాయికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ములకన్నిటికీ

నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది” అని ఓ కవన్నట్టుగా ప్రకృతిలోని అణువణువులో మాతృత్వాన్ని, దైవత్వాన్ని దర్శించిన జాతి మనది. “కంకర్ కంకర్ మే శివ శంకర్ హై” అని నమ్ముతాం మనం.

నిజానికి సకల జీవకోటి కోసం భగవంతుడు ప్రసాదించిన వరం, అవసరం ప్రకృతి. దీనిని మన పూర్వీకులు గ్రహించారు కనుకనే ప్రకృతిని ఆరాధించారు. దైవ స్వరూపంగా భావించారు. ఈ ఆరాధన వెనుక తమ అవసరాలు తీరుస్తున్న ప్రకృతి పట్ల కృతజ్ఞత ఉంది. దానిని సంరక్షించి భావి తరాలకందించాలనే దూరదృష్టి ఉంది. మన పూర్వీకులు యుగాలుగా తమ తర్వాతి తరాలకు అలాగే అందించారు.

వేల సంవత్సరాల పరాయి పాలన కారణంగా మనలో స్వాభిమానం నశించింది.

మీరు రాయిని, రప్పని, చెట్టుని, చేమని పూజించే అనాగరికులని తెల్లవాడు హేళన చేస్తే నిజమే కామోసనుకున్నాం. భావ దాస్యం ప్రవేశించింది. స్వార్థం ప్రవేశించింది. భౌతిక సుఖాల పట్ల వ్యామోహం పెరిగింది. మనము, మనది అన్న జట్టు భావన పోయి నేను, నాది అన్న స్వార్థ భావన ప్రబలింది.

మన అవసరాల కోసం, ఆవాసాల కోసం చెట్లను యథేచ్ఛగా నరికేశాం. అడవుల్ని హరించేశాం. కాంక్రీట్ జంగిల్ ను నిర్మించుకున్నాం. చెట్లు నరికే కొద్దీ, అరణ్యాలు నశించి, జనావాసాలు పెరిగే కొద్దీ ప్రకృతి లయ తప్పింది.  ఋతువులన్నీ గతులు తప్పాయ్. ఋతు పవనాలు మొహం చాటేశాయ్. దాంతో నెమ్మది నెమ్మదిగా వర్షపాతం తగ్గుతూ వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయ్. దానికి తోడు విపరీతమైన స్వార్థంతో విచక్షణ మరచి విచ్చలవిడిగా వనరుల్ని దుర్వినియోగం చెయ్యడం, వృధా చెయ్యడం మన ప్రస్తుత దుస్థితికి కారణం.

వర్షపాతం మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు పెరుగుతున్న జనాభా ఆహార అవసరాల దృష్ట్యా, లాభాపేక్ష కారణంగా నదులు, రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని పొలాలకు మళ్ళించుకుని వ్యవసాయం చేసే దశకు చేరుకున్నారు. తప్పేం కాదు. అంతటితో ఆగారా? పెరిగిన సాంకేతికత ఆసరాగా బోర్లేసి వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు భూగర్భ జలాలను తోడెయ్యడం మొదలెట్టారు.

ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. విస్తృతంగా చెట్లను నాటాలి. మేఘ మథనం లాంటి సాంకేతిక, శాస్త్రీయ విధానాల ద్వారా వర్షాలు పడేలా ప్రయత్నించొచ్చు. ప్రణాళిక లేని విచ్చలవిడి నిర్మాణాలు, ఆక్రమణల కారణంగా నదులు, చెఱువులు, కాలువలు, వాగులు, వంకలు కుదించుకుపోయాయ్. నిజానికి మానవ నిర్మిత జలాశయాలు, వాగులు, వంకల కంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే ఎక్కువ. భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా ఏర్పడినవవి. మన దురాశ కారణంగా వాటన్నిటినీ ఆక్రమించి కుంచింపజేసి ప్రకృతి అసమతుల్యతకు కారణమయ్యాం. ప్రకృతి ఆగ్రహానికి గురౌతున్నాం.

నగరాలనేమి, పల్లెలనేమి చిన్నపాటి వర్షానికే ఇళ్ళు, వీధులు అన్నీ జలమయమై పోతున్నాయ్. జనావాసాల మీదికి వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ల క్రితం చత్తీస్ గఢ్ లో వచ్చిన వరద అలాంటిదే. ఒక్క గంట కురిసిన వర్షంతోనే అపారమైన నష్టం సంభవించింది. ఇప్పుడు అస్సాంలో, ముంబైలో జరుగుతున్నదీ అదే. కారణం నీటిని నిల్వ చేసే అన్ని దారులూ మూసేశాం. అస్తవ్యస్త నిర్మాణాలతో ప్రకృతిని అవ్యవస్థితం చేశాం. ఇప్పుడు అవస్థలు పడుతున్నాం. ఇంకేముంది? అటు వర్షాలు పడక, ఇటు భూగర్భజలాలు అడుగంటి పోయి…. నీటి వెతలు మొదలు.

చెన్నై మహా నగరంలో చూస్తూనే ఉన్నాం నీటి కట కట. గుక్కెడు నీళ్ళు దొరికితే టన్ను బంగారం దొరికినంత సంబరపడాల్సిన పరిస్థితి. పగోడిక్కూడా ఈ కష్టాలు వద్దు. సరే ఈ కష్టం శాశ్వతం కాదు. రేపో మాపో వరుణుడు కరుణిస్తే ఈ కష్టాలు కరగక మానవు. అదే సమయంలో మానవుడి దురాశ, నిర్లక్ష్యం అంతరించకపోతే ఇదే నీటి కోసం ఒకర్నొకరు చంపుకుని మనల్ని మనమే అంతమొందించుకునే పరిస్థితులు రావచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు సైతం జరుగుతాయన్న నిపుణుల  హెచ్చరికలు నిజం కాకూడదంటే మనం కళ్ళు తెరవాలి.

ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు సైతం ఒన్ బకెట్ ఛాలెంజ్ పేరుతో నీటి పొదుపుకై ఉద్యమిస్తున్నారు. మంచిదే. అది మాత్రమే చాలదు. దానిని అందరూ ఆచరించాలి. మన దైనందిన అవసరాలను తక్కువ నీటితో పూర్తి చెయ్యడం అలవాటు చేసుకోవాలి. మన పల్లెల్లో నీటిని వృధా చేస్తే లక్ష్మీ దేవి మన ఇంటిని విడిచి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. నీటిని పొదుపుగా వాడుకోమని చెప్పడమే దాని ఆంతర్యం. అందుకే ఎప్పటికీ పెద్దల మాట చద్దన్నం మూట.

అయితే ఈ నీటి పొదుపు ఉద్యమం మన ఒంటిని ఇంటిని దాటి విస్తరించాలి. ఇంటింటా ఇంకుడు గుంతలతో ప్రతి వర్షపు చినుకునూ ఒడిసి పట్టగలగాలి. చెఱువులు, రిజర్వాయర్ల గండ్లు పూడ్చి వర్షపు నీటిని భద్రపరచుకోగలగాలి. చెఱువులు, నదుల ఆక్రమణలను తొలగించాలి. ఒక్క వర్షపు చినుకు కూడా వృధా కాకుండా చూసుకోగలగాలి. నీటి వినియోగం అధికంగా ఉండే పరిశ్రమలలో అతి తక్కువ నీటి వినియోగానికి పరిశ్రమలు సిద్ధం కావాలి. నీటిని దుబారా చెయ్యకుండా ఒకసారి వాడిన నీటిని  శుద్ధి చేసుకుని తిరిగి వాడుకునే పద్ధతులకు శ్రీకారం చుట్టాలి. వ్యవసాయదారులు సైతం తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించే శ్రీవరి సాగు వంటి పద్ధతులను అనుసరించాలి. పొలాలకు నీటిని కాలువల ద్వారా పంపడం కాకుండా స్ప్రింక్లర్స్ వంటి పరికరాల ద్వారా నీటిని మొక్కలకు అందించొచ్చు. తక్కువ నీటితో పండే ఆహార పంటలకు ప్రాధాన్యమివ్వాలి. ఇలా అడుగడుగునా నీటి పొదుపుకు శ్రీకారం చుట్టాలి.

 

“గాలీ నీరు భూమ్యాకాశం ప్రాణికోటికై దైవదత్తములు

శోషణ చేయుట పాపంబనియెడి బోధామృతమును గ్రహియిద్దాం.

ప్రకృతి హితముగ బ్రతికే మార్గం లోకమంతటికి చూపిద్దాం.

పల్లె పల్లెకెడదాం గుండె గుండె తడదాం

భారతమాతకు జై కొడదాం – భువిపై స్వర్గం నిర్మిద్దాం” అని అన్నట్లుగా

మనమందరం నేడే సంకల్పం చేద్దాం. మన మాటలో, మన చేతలో, మన నడవడిలో, మన ప్రతి అడుగులో లోకహితం ఇమిడి ఉండాలని. భావి తరాలకు సుసంపన్నమైన, సస్యశ్యామలమైన భవ్య భారతాన్నందిద్దామని.

మనందరం మన పాఠశాలలో సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపదను….. అని ప్రతిజ్ఞ చేశాం, చేస్తున్నాం. సంపదలంటే కేవలం డబ్బు, బంగారం, ఆస్థిపాస్థులే కాదు. మన ముందు తరాలు మనకందించిన ప్రకృతి సంపదను కూడా భద్రంగా మన భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది.

  • శ్రీరాం సాగర్