News

గుంటూరులో వేడుకగా శోభా రథయాత్ర

168views

గుంటూరు నగరంలో బుధవారం అద్భుత ఘట్టంగా, వేడుకగా శోభా రథయాత్ర సాగింది. వీధులన్నీ కాషాయ వర్ణ శోభితమయ్యాయి. జై శ్రీరామ్‌.. జై హనుమాన్‌ అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో భక్తిభావం వెల్లివిరిసింది. రథం మీద నిలువెత్తూ నీలమేఘశ్యాముడు భక్తులకు అభయమిచ్చాడు. అభయాంజనేయుడు సర్వత్రా మనోబలాన్ని కలిగించాడు. సీతాసమేత అయోధ్య రాముడ్ని తనివి తీరా చూసి, నగర ప్రజలు పులకించిపోయారు.

పట్నంబజారులో శ్రీ రామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బృందావన్‌ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి బుధవారం శోభాయాత్ర అంగరంగవైభవంగా ప్రారంభమైంది. హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి. కృష్ణమోహన్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, వేద సీడ్స్‌ అధినేత తులసి ధర్మచరణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై శోభా యాత్రను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీకి వేలాదిగా బైకుల మీద ఆశేష జనవాహిని తరలివచ్చింది. అక్కడ నుంచి లక్ష్మీపురం ప్రధాన రహదారి, మదర్‌ థెరిస్సా విగ్రహం, లాడ్జి సెంటర్‌, శంకర్‌విలాస్‌ సెంటర్‌, ఉమెన్స్‌ కళాశాల రోడ్డు, నాజ్‌ సెంటర్‌, ఓల్డ్‌ క్లబ్‌ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్‌, బ్రహ్మానందరెడ్డి స్టేడియం, పాత బస్టాండ్‌, హిమని సెంటర్‌, పట్నంబజారు, ఏటూకూరు రోడ్డు, నల్లచెరువు, ఎత్తు రోడ్డు, నగరంపాలెం, చుట్టుగుంట, మిర్చియార్డు మీదుగా మల్లారెడ్డినగర్‌లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వరకు ప్రదర్శన కొనసాగింది.

సమితి సభ్యుల వలంటీర్లుగా ఏర్పడి ఎటువంటి ఘటనలకు తావులేకుండా శాంతియుతమైన వాతావరణంలో యాత్రను నిర్వహించారు. నగర ప్రజలు కూడా సాదరంగా ఆహ్వానించారు. శంకర్‌విలాస్‌, ప్రభుత్వాసుపత్రి, నాజ్‌సెంటర్‌, భగత్‌సింగ్‌ బొమ్మ సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌, కన్యకాపరమేశ్వరి ఆలయం, నగరంపాలెం ప్రాంతాల్లో యాత్రల్లో పాల్గొన్నవారికి తాగునీరు, శీతల పానీయాలను అందజేశారు. జీజీహెచ్‌ వద్ద కులమతాలకు అతీతంగా ముస్లింలు మజ్జిగ పంపిణీ చేశారు.

తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్నే త్యజించిన గొప్ప పాలకుడు శ్రీరామచంద్రుడని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఇప్పటికీ మనం మంచి పాలన గురించి చెప్పుకోవాలంటే.. త్రేతాయుగం నాటి రాముని పాలన గురించే చెప్పుకుంటామని తెలిపారు. ధర్మం, న్యాయం, కరుణ, దయ, ధైర్యం, పరాక్రమం, నైతిక విలువలు ఇవన్నీ శ్రీరాముని ఆభరణాలని కీర్తించారు. తాను ధర్మాన్ని పాటిస్తూ, ప్రజల్ని ఆ మార్గంలో నడిపించే వాడే గొప్ప పాలకుడని తెలిపారు.