News

శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి

52views

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్‌లోని శక్తిపూర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కొందరు గాయపడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారని, రెజీనగర్‌లో హిందువులనే టార్గెట్ చేశారని బీజేపీ ఆరోపించింది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం శక్తిపూర్‌లో శ్రీరామనవమి ఊరేగింపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడింది. బాధితురాలిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి ఊరేగింపునకు రక్షణ కల్పించడంలో సీఎం మమతా బెనర్జీ మరోసారి విఫలమయ్యారని ఆరోపించారు. శోభా యాత్రపై దాడికి మమతా బెనర్జీ మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని అమిత్ మాల్వియా పేర్కొన్నారు.


ముర్షిదాబాద్‌లో అల్లర్ల అనంతరం మేదినిపూర్‌లోని ఎగ్రాలో ఒక వర్గంపై దాడి జరిగింది. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎగ్రా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ ఘటనలకు బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు.