
276views
శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవిని కన్నడిగులు తమ ఆడపడుచుగా భావిస్తుంటారు. ఉగాది ఉత్సవాల్లో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సారెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకుగాను ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. కొందరు వందల కి.మీలు పాదయాత్ర చేస్తూ శక్తి పీఠానికి చేరుకుంటుంటారు. మరికొందరు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం వరకు వాహనాల్లో వచ్చి అక్కడి నుంచి నల్లమల అటవీ ప్రాంతం మీదుగా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇలా పాదయాత్రగా తరలి వెళ్తున్న కన్నడ భక్త సమూహంతో అటవీ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వారు చేస్తున్న శివ నామ స్మరణతో అభయారణ్యం మార్మోగుతోంది. అదే సమయంలో పెద్దదోర్నాల- శ్రీశైలం రహదారి కూడా భక్తుల వాహన శ్రేణితో రద్దీగా మారింది.





