
అమెరికాలోనో.. రష్యాలోనో ఇప్పుడు సమయం ఎంతైందో.. అని అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం. భవిష్యత్తులో చంద్రుడిపై టైమ్ ఎంతైందో అనుకోవాల్సిన పరిస్థితి కూడా రానుంది. జాబిల్లి, ఇతర గ్రహాలపై సమయం తెలుసుకొనేలా ఓ ఏకీకృత ప్రామాణిక టైమ్‌ను నిర్ధరించాలని శ్వేత సౌధం నుంచి నాసాకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. చంద్ర యాత్రలకు దేశాలు, ప్రైవేటు సంస్థలు పోటీపడుతున్న వేళ ఈ ఆదేశాలు వెలువడం గమనార్హం.
శ్వేత సౌధంలోని ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ (ఓఎస్‌టీపీ) చీఫ్ ఆర్తి ప్రభాకర్ నుంచి వెళ్లిన ఆదేశాల ప్రకారం నాసా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి 2026 నాటికి ‘కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్’ కోసం వ్యూహాన్ని సిద్ధం చేయాలి. గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్ధరణలో చోటుచేసుకొనే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఇది చంద్ర యాత్రలకు వెళ్లే వాహక నౌకలు, ఉపగ్రహాలు కచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకం. సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకు 58.7 మిల్లీ సెకన్లను కోల్పోతుందని ఓఎస్‌టీపీ ఆదేశాల్లో ఉదహరించారు.
దీనిపై నాసాకు చెందిన స్పేస్ కమ్యూనికేషన్స్ అండ్ నేవిగేషన్ చీఫ్ కెవిన్ కాగ్గిన్స్ మాట్లాడుతూ ‘‘భూమిపై ఒక వేగంతో కదిలే గడియారం చంద్రుడి ఉపరితలం పైకి చేరగానే భిన్నంగా ప్రవర్తిస్తుంది. మీరు అమెరికా నేవల్ అబ్జర్వేటరీలోని అణుగడియారాల గురించి ఆలోచించండి. అవి అమెరికా హృదయ స్పందనలతో సమానం. ఇప్పుడు మీరు చంద్రుడిపై హృదయ స్పందనలను కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.
నాసా ఆర్టెమిస్ కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా తాజాగా ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేయడం వంటివి దీని లక్ష్యాలు. డేటా ప్రసారంలో, భూమిపై కమ్యూనికేషన్లలో సమన్వయం కోసం సీఎల్‌టీ అవసరం చాలా ఉంది. ప్రస్తుత అంతరిక్ష పరిశోధనల్లో ఓఎస్‌టీపీ మార్గదర్శకాలు కీలక పరిణామంగా చెప్పొచ్చు.





