ఆవులను రక్షించబోయిన వ్యక్తిని కాల్చి చంపిన ఆవుల స్మగ్లింగ్ ముఠా – నోరు మెదపని మేథావుల వైఖరిపై సర్వత్రా విమర్శలు

ముగ్గురు ఆడపిల్లల తండ్రి, గొ రక్షకుడైన వ్యక్తిని ఆవుల స్మగ్లింగ్ ముఠా దారుణంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని పాల్వాల్ లో చోటు చేసుకుంది.
స్థానిక గో రక్షక్ దళ్ కి చెందిన గోపాల్ (35) గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చురుగ్గా పాల్గొనేవాడు. అనేకసార్లు ఆ విధంగా గోవులను అక్రమ రవాణాదారుల చెర నుంచి రక్షించి ఉన్నాడు కూడా.
29/7/2019 సోమవారం ఉదయం షుమారు 7 గంటల సమయంలో కొందరు ఒక వ్యాన్లో చాలా ఆవులను అక్రమంగా తరలించుకుపోతున్నట్టుగా సమాచారం అందింది. మిగిలిన తన సహచరులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన గోపాల్ తాను వెంటనే బయల్దేరి హైవేపై గోవులను అక్రమంగా తరలించుకు వెళుతున్న వాహనాన్ని గుర్తించి ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆగకుండా వేగంగా వెళ్ళిన వ్యాన్లోని వ్యక్తులు వ్యాన్ వెనకాలే వెంబడిస్తూ వెళ్ళిన గోపాల్ పై తుపాకితో కాల్పులు జరిపారు. దాంతో గోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్న గోపాల్ సహచరులు రక్తపు మడుగులో ఉన్న గోపాల్ ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా గోపాల్ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సదరు వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆవుల స్మగ్లింగ్ ముఠాలను ఎవరైనా అడ్డుకుంటే మొసలి కన్నీరు కార్చే మేథావులెవరూ ముగ్గురు ఆడపిల్లల తండ్రి, గొ రక్షకుడు అయిన గోపాల్ మృతిపై గొంతెత్తకపోవడం, కనీసం ఖండించకపోవడాన్ని అందరూ విమర్శిస్తున్నారు. “ దేశంలో మైనారిటీలపై మూక దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రధానికి లేఖ వ్రాసిన మేథావులలో ఏ ఒక్కరికీ గోపాల్ హత్యను ఖండించటానికి తీరిక దొరకలేదు.” అంటూ కుహనా మేథావుల ద్వంద్వ వైఖరిపై చాలా మంది సోషల్మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.