ArticlesNews

“జై శ్రీరామ్ అనలేదని దాడి” వార్తలు నిరాధారం – పోలీసుల స్పష్టీకరణ

403views

‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయనందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖలీద్ అనే 17 ఏళ్ల బాలుడికి నిప్పంటించారన్న వార్త నిరాధారమైనదని తేలింది. ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయడానికి నిరాకరించినందుకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ముస్లిం బాలుడికి నిప్పంటించారని పేర్కొంటూ మీడియాలోని ఒక వర్గం నకిలీ వార్తలను సృష్టించి వ్యాప్తి చేసింది. ఈ ఘటన విషయమై నిజానిజాలు పరిశీలించిన ఒక ఆంగ్ల దినపత్రిక స్థానిక పోలీసుల ప్రకటన, ఇతర వాస్తవాల ఆధారంగా ఒక కథనం ప్రచురిస్తూ ఆ ఘటన తాలూకు వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చింది.

ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. చాందౌలీ జిల్లాకు చెందిన ముస్లిం బాలుడు ఉద్దేశపూర్వకంగా తనకు తాను నిప్పంటించుకోవడం ప్రత్యక్ష సాక్షి ఒకరు చూసిన విషయాన్ని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఆ బాలుడు పరస్పర విరుద్ధమైన, పొంతనలేని సమాధానాలు ఇచ్చాడని, అవి కూడా అబద్ధమేనని తేలినట్లు పోలీసులు తెలిపారు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు సమాధానాలు ఇవ్వడంతో ఘటనపై అనుమానాలు కలిగాయి.  అయితే ఆ బాలుడు  ఆ విధంగా ప్రవరించడంలో కొందరు తగిన శిక్షణనిచినట్టు అనుమానంగా ఉందని, అతను పేర్కొన్న స్థలాలలో ఎక్కడ కూడా ఆ బాలుడు లేడన్న విషయాన్ని  సిసిటివి ఫుటేజీలు స్పష్టం చేస్తున్న విషయాన్ని చందౌలి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎ.ఎన్.ఐ వార్త సంస్థకు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు మంద్రార్కపూర్  గ్రామంలోకి  పరుగెత్తినపుడు నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డుకుని, తీవ్రంగా కొట్టి, అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. చందౌలి జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో తనతో మాట్లాడినప్పుడు, ఆ బాలుడు ఈ ఘటన ఛటెల్ గ్రామంలో జరిగిందని చెప్పాడు. ఈ గ్రామం అతను ఇంతకుముందు పేర్కొన్న గ్రామానికి  వ్యతిరేక దిశలో 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఆస్పత్రికి తరలిస్తున్నపుడు మాత్రం అతడు తనతో పాటు ఉన్న పొలిసు అధికారితో దుధారిపులియా వద్ద కొంతమంది మోటార్ బైక్ లపై చుట్టుముట్టి బలవంతంగా బైక్ పై కూర్చోబెట్టుకుని ‘భాతిజ మోడ్’ అనే గ్రామం వైపుగా తీసుకువెళ్ళి అక్కడ కిందపడవేసి నిప్పంటించారని తెలిపాడు. ఈ విధంగా మూడు పరస్పర విరుద్ధ కథనాలను సృష్టించడంతో పరిస్థితి అనుమానాస్పదంగా మారిందని పోలీసులు తెలిపారు.

కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వామపక్ష, ఇస్లామిక్ అనుకూల మీడియా ‘ద్వేషపూరిత నేరాల’ పేరిట అవాస్తవాలను, కల్పిత కథనాలను ప్రచారం చేస్తోంది. ఈ ఘటనలో పక్షపాత మీడియా ప్రచారం చేసిన కథనాలన్నీ నిరాధారమైనవని తేలింది. ఆన్‌లైన్ మాధ్యమంలోని ఒక విభాగం, హానికరమైన ఉద్దేశ్యాలతో, వివిధ నేరఘటనలకు  మతం రంగు పులిమి వాటిని ‘మత విద్వేషపూరిత నేరాలు’  పేరిట మెజారిటీ హిందూ సమాజంపై బురద చల్లే విధంగా ప్రచారం చేస్తోంది.

Source : VSK, TELANGANA.