
గ్రామంలో అందరికీ ఉపయోగపడే చెఱువు ఆక్రమణపై ఫిర్యాదు చేసినందుకు కొందరు కక్ష గట్టి గ్రామంలోని దేవాలయ పూజారులైన తండ్రీ కొడుకులను హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా ముదలైపట్టు గ్రామంలో ఆ గ్రామ దేవాలయ పూజారి వీరమలై (70)ని, ఆయన కుమారుడు నల్ల తంబి(41)ని కొందరు దుండగులు హత్యచేశారు.
వివరాల్లోకి వెళితే… గ్రామానికి తరతరాలుగా నీరందిస్తూ వచ్చిన చెఱువు, మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా ఎండిపోతూ ఉంది. 39 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెఱువును కొందరు గ్రామ పెద్దలు ఆక్రమించి వ్యవసాయ భూమి క్రింద మార్చివేశారు. గ్రామంలో చెఱువు లేకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది.
పూజారి వీరమలై మృతి చెందిన చోట విచారణ నిర్వహిస్తున్న పోలీసులు
దీంతో పూజారి వీరమలై తమ గ్రామంలోని 50 మంది పెద్దలు గ్రామంలోని చెఱువును ఆక్రమించి వ్యవసాయ భూమిగా మార్చివేశారని కనుక ప్రభుత్వం ఈ అంశంపై విచారణ జరిపించి ఆక్రమణలను తొలగింపజేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానితో హైకోర్టు, చెఱువు ఆక్రమణలను తొలగించవలసినదిగా గ్రామ పరిపాలనాధికారులను ఆదేశించింది. దానితో ఇటీవలే చెఱువు హద్దుల సర్వే నిర్వహించిన ప్రభుత్వాధికారులు చెఱువు హద్దులను గుర్తించి మార్క్ చేసి వెళ్ళారు.
ఈ నేపథ్యంలో పూజారి వీరమలైని కొందరు దుండగులు పట్టపగలే గ్రామంలోని ఆయన స్వగృహం వద్ద హత్య చేశారు. సమీప టౌన్ నుంచి మోటారు సైకిల్ పై తిరిగివస్తున్న ఆయన కుమారుడు నల్ల తంబి (41) ని కూడా కొందరు దారి కాచి హత్య చేశారు. పూజారి వీరమలై తమ ఆక్రమణల విషయమై కోర్టుకు వెళ్ళాడన్న కోపంతో గ్రామ పెద్దలే ఈ హత్యలు చేయించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.