News

భోజ్‌శాలలో కొనసాగిన సరస్వతి పూజలు

259views

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణంలో మంగళవారం హిందువులు సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఆరువారాల్లోగా భోజ్‌శాలలో ‘శాస్త్రీయ సర్వే’ను నిర్వహించాలంటూ ఈ నెల 11న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగం ఈ నెల 22 నుంచి (ఏఎస్‌ఐ) సర్వే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సర్వే పనులు మొదలు కాకుండానే పలువురు భక్తులు భోజ్‌శాలకు చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఏఎస్‌ఐ సర్వేతో ఈ ప్రదేశ వివాదానికి ఉత్తమ పరిష్కారం లభిస్తుందని భోజ్‌ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు బల్వీర్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యయుగం నాటి స్మారక కట్టడమైన భోజ్‌శాలను హిందువులు వాగ్దేవి (సరస్వతి) ఆలయం అని నమ్ముతారు. ముస్లింలు కమల్‌ మౌలా మసీదు అని విశ్వసిస్తారు. ఇక్కడ మంగళవారం హిందువుల పూజలకు, శుక్రవారం ముస్లింల ప్రార్థనలకు 2003 ఏప్రిల్‌ 7 నుంచి ఏఎస్‌ఐ అనుమతించింది.