ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 37 ; చెరుకువాడ వెంకట నరసింహం

385views

గంగాఝరి వంటి ఉపన్యాసపటిమతో, ఆంగ్ల ప్రభుత్వముపై విమర్శల వర్షాన్ని కురిపించి, తెలుగువారిలో జాతీయభావాన్ని, స్వేచ్ఛాపిపాసను ఉవ్వెత్తున ఎగసి పడునట్లు చేసిన మహావక్త ‘ఆంధ్ర డెమొస్తనీస్’ చెరుకువాడ వెంకట నరసింహం, కృష్ణాజిల్లా దివి తాలూకా, ఘంటసాల గ్రామంలో మార్చి 1, 1987న సీతారామయ్య, లక్ష్మీనరసమ్మ రంపతులకు ఏకైక పురుష సంతానంగా జన్మించారు. ప్రాథమిక విద్య మేనమామల ఇంట యార్లగడ్డలో సాగింది. బందరులో మెట్రిక్యులేషన్ చదివి, మద్రాసు విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనారు. ‘లా’ చదువుతూ ఫీజు కట్టలేక మానివేశారు. 1907లో జవారుపేట స్కూలులో ఉపాధ్యాయునిగా చేరి 1908 వరకూ పనిచేశారు. 1908-09 మధ్య గుంటూరు నుండి వెలువడే ‘దేశాభిమాని’ పత్రికకు, మరికొంతకాలం ‘కృష్ణా పత్రిక’కు ఉపసంపాదకునిగా పనిచేశారు. కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారిని గురువుగా భావించారు. 1910-18 మధ్య గుడివాడ తాలుకా, కౌతవరం గ్రామంలో ‘ఆంధ్రలక్ష్మి జాతీయవిద్యాలయం’ను స్థాపించి ప్రధానోపాధ్యాయునిగా అనేకమంది దేశభక్తులను తయారుచేశారు.

1918లో మహాత్మాగాంధీని అస్సాంనందు కలుసుకొని వారి ప్రభావంతో జాతీయవాదిగా మారారు. 1919లో బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తూ ఆంధ్రదేశమంతటా వందలాది గ్రామాల్లో యువతలో, తన సహజ మృదుమధుర వాగ్దాటితో రాజకీయ చైతన్యాన్ని ప్రజ్వరిల్లచేసిన దిట్ట. సహాయ నిరాకరణోద్యమంలో ఉద్యమ ప్రచార సారథిగా చెరుకువాడ అనేక జిల్లాలలో పర్యటించారు. 1920 అక్టోబరు 30న తణుకు తాలూకా కాంగ్రెస్ ప్రథమ సమావేశంలోను, అక్టోబరు 31న నరసాపురం తాలూకా కాంగ్రెస్ సమావేశంలోను, నవంబరు 1న తణుకు తాలూకా కాంగ్రెస్ ద్వితీయ సమావేశంలోను వేలాది మంది ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. 1919 చట్ట ప్రకారం జరిగే ఎన్నికలను నిరసిస్తూ ఎవరూ ఓటు వేయరాదని, ఎవరూ పోటీ చేయరాదని ఉద్బోధించారు. చెరుకువాడ ప్రబోధం ప్రజల ఆమోదాన్ని పొందింది. నవంబరులో జరిగిన ఎన్నికలలో జిల్లాలో 5% మించి ప్రజలు ఓటింగులో పాల్గొనకుండా చేసిన ఘనత చెరుకువాడ వారిది. 1921 జనవరి 1న ఏలూరు మహాసభలో ఈ ఉద్యమంలో ప్రజలు సహాయ నిరాకరణను చేస్తూ ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించాలని, పంచాయితీ కోర్టులు స్థాపించుకోవాలని పేర్కొన్నారు. అందువలన సత్వరం సులభంగా, వ్యయం లేకుండా న్యాయం లభిస్తుందని ప్రచారం చేశారు. 1921 నవంబరు 19 నుండి డిశంబరు 5 వరకూ తణుకు, నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం తాలూకాలలో సుడిగాలి పర్యటనలు జరిపి అసహాయోద్యమంలో ప్రజలు అనుసరించవలసిన విధానాలను హృదయానికి హత్తుకునేలా ప్రవచించారు. వీరి ఉపన్యాసాలు వినటానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చే వారంటే వారి వాక్రవాహ వైదుష్యం అర్ధమౌతుంది. 1921 జనవరిలో తణుకునందు ప్రభుత్వ పాఠశాలలను బహిష్కరించాలని వాటి స్థానే జాతీయ విద్యాలయాన్ని స్థాపించాలని మంత్రి రావు వెంకటరత్నం, దొడ్డిపట్ల వెంకటరత్నం మరియు ఇతర నాయకులతో కలిసి మూడు రోజులు విస్తృత ప్రచారం చేశారు. నిధులను సేకరించారు. ఫలితంగా తణుకునందు హార్టింజ్ భవనంలో జాతీయ పాఠశాల స్థాపించబడింది. చెరుకువాడ చెరుకురసం వంటి ఉపన్యాస వెల్లువకు వేలసంఖ్యలో ప్రజలు చైతన్యం కావటం సహించలేని ఆంగ్ల ప్రభుత్వం చెరుకువాడను 1921 డిశంబరులో అరెస్టు చేసి 1 సంవత్సరం కఠిన
కారాగారశిక్ష విధించింది.

ఖద్దరు ప్రచారయాత్రకు 1929లో గాంధీజీ బందరు వచ్చినప్పుడు జాతీయ కళాశాలలో ఆయనకు విడిది ఏర్పాటుచేశారు. ఆ రోజున గాంధీజీ ఉపన్యాసాన్ని చెరుకువాడ చక్కగా అనువదించి చెప్పారు. 1930 ఉప్పు సత్యాగ్రహము నందు చెరుకువాడ పాల్గొని ఏప్రిల్ 22, 1930 నుండి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను రాజమండ్రి, వెల్లూరు, కడలూరు జైళ్ళలో అనుభవించారు. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణాజిల్లాల అంతటా విస్తృత ప్రచారం నిర్వహించి హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించి, మన తోటి సోదరుల గౌరవాన్ని కాపాడి, మన మత ఔన్నత్యాన్ని చాటాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అగ్రవర్ణాలవారు, విప్రులు హృదయ పూర్వకంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ వస్త్ర దహనకాండలో పాల్గొని, శాసనోల్లంఘన చేసి రాజద్రోహకరమైన ఉపన్యాసము లిచ్చినారనే ఆరోపణపై ఐ.పి.సి. 108 సెక్షనప్రకారం ఏలూరులో అరెస్టు చేసి జనవరి 7, 1932 నుండి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను రాజమండ్రి, కడలూరు జైళ్ళలో అమలుపరిచారు. చెరుకువాడ కొన్ని సంవత్సరాలు కృష్ణా జిల్లా కాంగ్రెసు అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు.నిరంతరం కాంగ్రెస్ రాజకీయాలలో ఉపన్యాసకేసరిగా తిరిగిన నరసింహంగారికి ఆదాయం తగ్గి, ఆరోగ్యం క్షీణించి ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో వారు నరసింహంగారి రాజకీయ శిష్యులు గొట్టిపాటి బ్రహ్మయ్య, నార్ల వెంకటేశ్వరరావు, మోటూరి సత్యనారాయణ మున్నగువారు సుమారు రూ.6000/-లు పైగా సమీకరించి నరసింహంగారికి సహాయం అందించారు.

సమకాలికులు చెరుకువాడ వారిని ‘భీమాడింఢిమ’, ‘ఉపన్యాసకేసరి’, ‘ఉపన్యాస చక్రవర్తి’, ‘చెరుకురసప్రవాహం’ అనే బిరుదులతో సత్కరించి సన్మానించారు. 1940 లని నుండి నరసింహంగారు తణుకులో స్థిరనివాస మేర్పరచుకుని గాంధేయవాదిగా జీవనం గడిపారు. గాంధీజీ నిర్మాణ కార్యక్రమంపై అచంచల విశ్వాసంతో గ్రామాభ్యుదయానికి, ఖాదీ ప్రచారానికి, కుటీర పరిశ్రమల అభివృద్ధికి, హరిజనోద్దరరణకు, సర్వోదయ కార్యక్రమాలు నిర్వహణకు జీవితాంతం కృషి చేశారు.

తెలుగులో ఉపన్యాస ఝరితోపాటు, అద్భుత రచనాపాటవం కలిగిన చెరుకువాడ 1. స్వరాజ్యదర్పణం 2. శాసనసభలు, 3. మల్లుతాను మహాసభ, 4. అరణ్యరోదనము, 5. హక్కు విడుదల దస్తావేజు, 6. రాజకీయ పంచాంగము అనే గ్రంథాలను రచించారు. చెరుకువాడ వెంకటనరసింహం తన చివరి కాలంలో మానసిక వేదనతో, ఆర్థికసమస్యలు, ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటూ ఈ నిరాడంబర నిశ్చలమూర్తి జూన్ 23, 1964న తన 78వ ఏట తణుకు పట్టణంలో కీర్తికాయులైనారు.