
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో జాతర జరిగే మహా శివరాత్రి రోజు కొండకు వీఐపీల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చి దర్శనం చేసుకోవడం వరకు ఫరవాలేదు. కానీ కొందరు అధికార పార్టీ పెద్దలు వీఐపీ దర్శనాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. వీఐపీ దర్శనం టికెట్లు పరిమితికి మించి పొందడం, కొన్ని సందర్భాల్లో టికెట్లు సొంతంగా ముద్రించడం గమనార్హం. వీఐపీల పేరుతో ఇష్టానుసారం టికెట్లు ఎవరికిపడితే వారికి ఇస్తున్నారు. వీఐపీలు వేలకు వేలు కొండకు పోటెత్తుతున్నారు. దీంతో సామాన్య భక్తులకు అవస్థలు తప్పడం లేదు. దేవస్థానం అధికారులు, పోలీసులు వీఐపీల సేవలో తరించడంతో భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తుంది. ఏటా ఈ ఇబ్బంది ఎదురవుతున్నా, జిల్లా ఉన్నతాధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఏడాది జాతరకు ముందే వీఐపీ టికెట్ల గొడవ మొదలైంది. ఇప్పుడైనా యంత్రాంగం మేల్కొని చర్యలు తీసుకోవాలని సామాన్య భక్తులు కోరుతున్నారు.
ఈసారి తామే జారీ చేస్తామంటున్న కలెక్టర్, ఎస్పీ: త్రికోటేశ్వరస్వామి దర్శనానికి వీఐపీ పాస్‌లు కావాలనుకునేవారు కలెక్టర్ కార్యాలయం నుంచి ముందస్తుగా పొందాలని ఫిబ్రవరి 27న కలెక్టర్ ఓ ప్రకటన కూడా జారీ చేశారు. వాహనాల క్రమబద్ధీకరణ, భద్రతా చర్యలు తమ చేతుల్లో ఉంటాయని, ఎన్ని పాస్‌లు జారీ చేస్తే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుందో తమకే తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. ఏటా వీఐపీ పాస్‌లను ఎస్పీ కార్యాలయం నుంచే వస్తున్నాయని, శాంతిభద్రతా చర్యల దృష్ట్యా ఈసారి తామే జారీ చేస్తామని కొండపై జరిగిన సమీక్షలో ఎస్పీ రవిశంకర్‌రెడ్డి చెప్పారు. అప్పుడే వాహనాల క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు. భద్రతా చర్యలకు వీలుంటుందని లేకుంటే వేలల్లో వీఐపీలతో కొండ నిండిపోయి తమ విధులకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. కానీ వీఐపీ పాస్‌ల జారీపై కలెక్టర్ కూడా పట్టుపడుతున్నారు. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
గత అనుభవాలు చూసైనా..
వీఐపీ పాస్‌లు ఐదు వేల వరకే ఇవ్వాలని అంతకుమించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. కానీ గతేడాది పది వేల వరకు ఓ ఎమ్మెల్యే తన అనుచరులకు ఇప్పించి దర్శనం చేయించారు. వీఐపీ బస్సుల్లో ఒక పాస్‌పై అయిదుగురికి అనుమతివ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీనివల్ల సామాన్య భక్తులకు దైవదర్శనం చేయడానికి నాలుగు గంటలు పట్టింది. మూడు కిలోమీటర్ల మేర దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. పైగా ఎండలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాదైనా పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.




