
త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు రూ.39,125 కోట్లతో ఐదు భారీ రక్షణ సాధన కొనుగోలు ఒప్పందాలపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది. దీనిలో భాగంగా బ్రహ్మోస్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, ఏరో ఇంజన్లను సేకరించనున్నారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్) నుంచి రూ.19,519 కోట్లతో బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మరో రూ.988 కోట్లతో నౌకల్లో ఉపయోగించే బ్రహ్మోస్ వ్యవస్థను కొనుగోలు చేయనున్నారు. ఇక, మిగ్-29 విమానాల కోసం ఆర్‌డీ-33 ఏరో ఇంజన్ల కొనుగోలుకు ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హెచ్‌ఏఎల్‌తో రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.5,249.72 కోట్లు. అలాగే రూ.7,688.82 కోట్లతో క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్(సీఐడబ్ల్యూఎస్), రూ.5,700 కోట్ల వ్యయంతో హైపవర్ రాడార్‌లను కొనుగోలు చేయడానికి ఎల్‌అండ్‌టీ సంస్థతో ఒప్పందం కుదిరిందని రక్షణ శాఖ వెల్లడించింది.





