News

ఆరెస్సెస్ యొక్క నిస్వార్థ సేవా తత్వమే నన్ను దానికి దగ్గర చేసింది. –  కేరళ మాజీ డీజీపీ జాకోబ్ థామస్.

990views

కేరళ కొచ్చిలోని ఆరెస్సెస్ ఐటి మిలన్ గురు దక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ మాజీ డీజీపీ జాకోబ్ థామస్ ఆరెస్సెస్ ప్రార్ధన జరుగుతున్న సమయంలో అందరు స్వయంసేవకులకు మల్లే ప్రణామ్ స్థితిలో నిలుచున్నారు.

ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ థామస్ తన అధ్యక్షోపన్యాసంలో ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆరెస్సెస్ అద్భుతాలను ఆవిష్కరిస్తోందన్నారు. స్వయంసేవకులు ఎలాంటి పేరు ప్రతిష్ఠలు, ప్రచారము ఆశించకుండా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను నిశ్శబ్దంగా సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి నిస్వార్థ సేవా తత్వమే తాను ఆరెస్సెస్ పట్ల ఆకర్షితుడవ్వడానికి కారణమని ఆయన తెలిపారు.

విదేశీ విష సంస్కృతి కారణంగా భారతీయ సంస్కృతి మసకబారుతోందని ఆయన అన్నారు. ఆరెస్సెస్ తో తమకున్న సాన్నిహిత్యాన్ని వెల్లడించటానికి చాలామంది భయపడే పరిస్థితి కేరళలో నెలకొందని ఆయన అన్నారు.

దేశానికి సేవలందించటానికే తాను సివిల్ సర్వీసెస్ లో చేరానని, అలా దేశానికి సేవలందించే ఏ సంస్థతో అయినా కలసి పని చెయ్యడానికి తాను సదా సిద్దంగా ఉంటానని, ఆ కారణంగా తాను ఆరెస్సెస్ తో కలసి పని చెయ్యడానికి సంకోచించటం లేదని కార్యక్రమం పూర్తయిన అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఈ సందర్భంగా శబరిమల అంశంపై కూడా శ్రీ థామస్ స్పందించారు. ప్రజల విశ్వాసాలు, కట్టుబాట్లపై నిర్ణయాలు తీసుకునే ముందు శాసన కర్తలు, కార్య నిర్వాహకులు ఇద్దరూ ప్రజల భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వాల తప్పిదాలపై ప్రశ్నించడం ప్రజల కర్తవ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

పదవీ విరమణ అనంతరం తనకు తగినంత తీరిక దొరకడంతో తాను గత సంవత్సరం శబరిమలను, కుంభమేళాను సందర్శించాగలిగానని కూడా ఆయన వెల్లడించారు.