
కూచిపూడి నాట్యం.. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం పేరుతో ఆవిర్భవించిన ఓ అపురూప కళారూపం. విశ్వవిఖ్యాతమైన ఈ నాట్య కళలో నిష్ణాతులైన నలుగురికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వరించాయి. సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి(ఢిల్లీ) దంపతులకు అకాడమీ రత్న, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్య విభాగాధిపతిగా ఉద్యోగ విరమణ చేసిన భాగవతుల సేతురామ్(కూచిపూడి-2023వ సంవత్సరానికి), మద్దాలి ఉషాగాయత్రి(కర్నూలు-2022వ సంవత్సరానికి) సంగీత నాటక అకాడమీ అవార్డులు, యువ నాట్యాచార్యుడు ఎం.సురేంద్రనాథ్(అవనిగడ్డ-2023వ సంవత్సరానికి) ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిపై అందిస్తున్న ప్రత్యేక కథనం.
సృజనాత్మక నర్తకుడిగా..

కూచిపూడి భాగవతుల కుటుంబంలో పుట్టిన భాగవతుల సేతురామ్ సృజనాత్మక నర్తకుడిగా పేరొందారు. ఈయన యక్షగాన నాట్యాచార్యులు, హైదరాబాద్‌కు తొలిగా కూచిపూడిని పరిచయం చేసిన భాగవతుల రామకోటయ్య కుమారుడు. అయిదేళ్ల ప్రాయం నుంచే తండ్రివద్ద శిక్షణ పొందిన ఆయన మన దేశంతోపాటు అమెరికా, సింగపూర్, మలేసియా, దుబాయ్, దక్షిణాఫ్రిక తదితర 14 దేశాల్లో తన శిష్యబృందాలతో కలిసి మూడు వేలకుపైగా ప్రదర్శినలిచ్చి ప్రశంసలు అందుకున్నారు. వసంత రాజీయం, మాళవిక, ఊర్వశి, గీతాగోవిందం, పుష్పవిలాసం వంటి ఎన్నో నృత్యరూపకాల్లో ఘటోద్కజుడు, బలరాముడు, హిరణ్యకశ్యపుడు, బాణాసురుడు తదితర పాత్రల్లో నర్తించారు. ఉత్తమ నృత్య దర్శకత్వానికి నంది, రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది, దేవాదాయ శాఖ నుంచి సరస్వతి, రసమయ, సిలికానాంధ్ర గిన్నిస్ పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతిభతో విజయబావుటా

అవనిగడ్డలో కళాకారుల కుటుంబంలో జన్మించిన మురమళ్ల సురేంద్రనాథ్ తన ప్రతిభతో అద్భుత నృత్య కళాకారుడిగా ఎదిగారు. తండ్రి ప్రముఖ మృదంగ విద్యాంసుడు విజయకుమార్, తల్లి లక్ష్మీకాంతం ప్రసిద్ధ హరికథా విద్యాంసుడు అమ్ముల విశ్వనాథ భాగవతార్ మనుమరాలు. ప్రముఖ నాట్యాచార్యులు భాగవతుల వేంకటరామశర్మ వద్ద 12 ఏళ్ల నుంచే నాట్యాభ్యాసానికి శ్రీకారం చుట్టి తరువాత సింగారమణి సీహెచ్ అజయ్‌కుమార్ వద్ద భరతనాట్యం నేర్చుకుంటూ ప్రముఖ కూచిపూడి గురువులు కేవీ సత్యనారాయణ, పద్మశ్రీ శోభానాయుడు, దీపికారెడ్డి, అలేఖ్యపుజల, వేదాంతం రామలింగశాస్త్రి తదితర ఉద్దండుల వద్ద మెలకువలు ఔపోషణ పట్టారు. అమెరికా, కెనడా, సింగపూర్, మలేసియా వంటి దేశాలతో పాటు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 1500కుపైగా ప్రదర్శనలిచ్చారు. సురేంద్రనాథ్ భార్యకూడా బిజిన నాట్యాచారిణి. కథక్‌లో నృత్యశిరోమణి బిరుదు అందుకున్న ఈ యువ నాట్యాచార్యుడు శాస్త్రీయ నాట్య పరిరక్షణకు పాటుపడతానంటున్నారు.
కూచిపూడి నృత్య జంట

రాజారెడ్డి, రాధారెడ్డి(ఢిల్లీ)లు యావత్ కళాలోకానికి సుపరిచితులైన కూచిపూడి నృత్యజంట. ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వీరు కూచిపూడికి చెందిన వేదాంతం ప్రహ్లాదశర్మ వద్ద, ఏలూరులోని కళాక్షేత్రంలో నాట్యాన్ని అభ్యసించారు. దేశంలోనే కాకుండా అమెరికా, క్యూబా, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాల్లోనూ వేలాది ప్రదర్శనలిచ్చారు. వారి కృషికి 1984లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో, 1991లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించాయి. 2000లో పద్మభూషణ్ వరించింది. 2010లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.





