News

విజయవాడలో ఐదు రోజుల పాటు ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’

355views

జయం.. దుర్గా.. అంటూ దుర్గమ్మను కీర్తిస్తూ ప్రఖ్యాత సహస్రావధాని డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ను ప్రారంభించారు. తెలుగు వారి సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించే అవధానంలో డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ తెలుగు భాష మాధుర్యాన్ని చాటి చెప్పారు. ప్రతి పదంలోనూ తెలుగు ఔన్నత్యాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ, ధర్మదాయ శాఖ, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఐదు రోజుల పాటు కొనసాగే ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ సోమవారం ప్రారంభమైంది. తొలుత 30 మంది పృచ్ఛకులతో దత్తపదిని ప్రారంభించి ఆ తరువాత సమస్యా పూరణం, వర్ణాలు, ఆశువులు, స్వరపది, మీ స్వరానికి నా పాట తదితర అవధాన ఘట్టాలను నిర్వహించారు. శ్రీదుర్గామల్లేశ్వరుల వైభవాన్ని చాటుతూ సాగిన అవధానం ఆద్యంతం ప్రేక్షకులను తన్మయులను చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సాహితీవేత్తలు పృచ్ఛకులుగా సంధించిన అంశాలకు అవధానిగా నాగఫణిశర్మ ధారణతో దీటుగా బదులిచ్చి ఆకట్టుకున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పాలపర్తి శ్యామలానందప్రసాద్‌, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, డాక్టర్‌ కె.సౌజన్యలక్ష్మి, మా శర్మ, పి.వి.జ్యోతి, సింగం లక్ష్మీ నారాయణ, డాక్టర్‌ శామనపూడి వెంకటేశ్వరరావు వంటి సాహితీవేత్తలు అలరించారు. స్వరపదిలో భాగంగా సంగీత కళాకారుడు పోపూరి గౌరీనాథ్‌ ఆధ్వర్యంలో సంగీత కళాకారులు అడిగిన స్వరాలకు సైతం నాగఫణిశర్మ అవధాన ప్రక్రియలో బదులిచ్చి మెప్పించారు. కార్యక్రమంలో దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.

కవి నిరంతర లోకహితుడు

కవి నిరంతర లోకహితుడని ద్విసహస్రావధాని డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. కవి నుంచి వచ్చే సాహిత్యం కల్పవృక్షం వంటిదన్నారు. సమాజాన్ని జాగృతం చేసే సాహిత్యం అన్ని రకాలుగా లోకహితానికి బాసటగా నిలుస్తుందన్నారు. దుర్గమ్మ ఆలయం, ఏపీ ప్రభుత్వం ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావటం అభినందనీయమని పేర్కొన్నారు.‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ వంటి ఐదు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు జాతి వైభవాన్ని చాటే సాధనాలని కొనియా డారు. అవధానం తెలుగు వారికి మాత్రమే ఉన్న గొప్ప ప్రక్రియ అని, అటువంటి ప్రక్రియను జగద్విఖ్యాతం చేసిన మాడుగుల నాగ ఫణిశర్మతో తాను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. నాగఫణిశర్మ ప్రతి పదం సామాజిక స్పృహను కలిగించే సాధనమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.

ఆలయాలు కేంద్రబిందువులు కావాలి

సాహిత్యం, సంస్కృతి, భాషా వికాసాలకు దేవాలయాలు కేంద్ర బిందువులుగా ఉండాలని అతిథిగా హాజరైన రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ ఆకాంక్షించారు. ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ అమ్మవారి కీర్తిని మరింతగా వివరిస్తూ పండిత, పామరులను సైతం అలరిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో మును ముందు మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు.