
స్వాతంత్య్ర సముపార్జనా మహాయజ్ఞంలో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగి, ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తట్టుకొని నిలిచి ముందుకు సాగిన మహానుభావుడు బులుసు సాంబమూర్తి, త్యాగంలో, ధైర్యంలో, సంకల్పంలో, శ్రద్ధలో, పట్టుదలలో, సమర్థతలో, సర్వసమర్పణలో అసమానుడు సాంబమూర్తి. 1886వ సంవత్సరంలో మార్చి నాల్గవ తేదీన జన్మించారు.
సాంబమూర్తి బాల్యం దుళ్లలోనే గడచింది. అక్కడే ఆయన ప్రాథమిక విద్య సాగింది. కాకినాడలో మాధ్యమిక విద్య నడిచింది. ఆ తరువాత ఆర్ధిక ఇబ్బందుల మధ్యన, జీవన ఒడుదొడుకుల మధ్యనే ఆయన మద్రాసులో బి.ఏ. చదువుకున్నారు. డిగ్రీ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కాగానే, విజయనగరం మహారాజా కళాశాలలో ఆయనకు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అక్కడే ఆయన ఫిజిక్స్ లెక్చరర్ గా మంచి గౌరవం సంపాదించారు. కానీ కొంతకాలానికి లెక్చరర్ ఉద్యోగాన్ని వదలిపెట్టి 12 స్వతంత్రమైన జీవనవిధానం కలిగిన న్యాయవాది కావాలని ఆశించారు.
తిరిగి మద్రాసు చేరి బి.ఎల్. చదివారు. బి.ఎల్.డిగ్రీ చేతికి రాగానే, న్యాయవారిగా డి తన పేరు నమోదు చేసుకొని, కాకినాడలో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అనతికాలంలోనే గొప్పపేరు సంపాదించుకున్నారు. 1911లో కాకినాడలో న్యాయవాదిగా ఆరంభమైన సాంబమూర్తిగారి ప్రయాణం ఎంతో విజయవంతంగా సాగింది. క్రిమినల్ లాయర్ గా, సాంబమూర్తి ఘనత జిల్లా అంతా వ్యాప్తి చెందింది. గౌరవం, గుర్తింపు ఆపైన సంపాదన వారికి స్వంతమయ్యాయి. జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఆయన కేసులు నడిపేవారు. చాలా అందమైన సిల్క్ సూటు, తలపైన అందమైన సిల్క్ టోపీ, కాళ్లకు మెరిసే బూట్లు, చేతికి ఉంగరాలు, బంగారు చైన్ కలిగిన స్విస్ గడియారం.. అప్పట్లో ఆయన్ని చూస్తే ఓ రాజకుమారుడిలా ఉండేవారు ఆ రోజుల్లో సాంబమూర్తి గారికి మోటారు సైకిల్ కూడా ఉండేది. కాకినాడలో ఇంటిదగ్గర మోటారు సైకిల్పై బయలుదేరి కాకినాడ, పెద్దాపురం, రాజమండ్రి కోర్టుల్లో వాదనలు వినిపించి వచ్చేవారంటే నిజంగా అద్భుతమేనని చెప్పాలి.
ఆర్థికంగా చాలా ఉచ్ఛదశలో ఉన్నప్పుడు, సాంబమూర్తిగారికి తిలక్ హోంరూల్ ఉద్యమపు పిలుపు వినబడింది. అదే సమయంలో వారొకసారి దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి ప్రసంగం వినటం తటస్థించింది. లాయర్ ప్రాక్టీస్ తప్ప, మరేదీ పట్టని సాంబమూర్తిగారి మనసును దేశసేవ గట్టిగా పట్టింది. ఆయన దృష్టి హోంరూల్ ఉద్యమం వైపు సాగింది. ఈలోగా మహాత్మాగాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని ఆరంభించడం, న్యాయవాదుల్ని తమ వృత్తుల్ని వదిలివేయమని ప్రబోధించడం జరిగింది. గాంధీజీ పిలుపు మేరకు ఆయన. తన న్యాయవాద వృత్తిని వదిలేశారు. నిజానికి ఆనాటికి ఆయన ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉచ్ఛదశలో ఉన్నారు. ప్రతినెలా వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్న కాలం అది. అన్నీ వదిలేశారు. నిర్మోహంగా, స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టి, గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు. అఖిలభారత కాంగ్రెస్ మహాసభలు, 1923లో కాకినాడలో జరపాలని, ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ 1923 జనవరి 20న నిర్ణయించింది. దాంతో మహాసభలు నిర్వహణకు దేశభక్త కొండా వేంకటప్పయ్య అధ్యక్షుడిగా, బులుసు సాంబమూర్తి కార్యదర్శిగా తాత్కాలిక ఆహ్వాన సంఘం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, ఉన్నవ లక్ష్మీ నారాయణ, పైడా వెంకట చలపతి ఆ సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ మహాసభల విజయం వెనుక సాంబమూర్తి గారి కృషి ఎంతో ఉంది. సాంబమూర్తి గారికి ఒక్కడే అబ్బాయి. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ మహాసభలు జరిగేముందే, ఆ అబ్బాయి మరణించాడు. ఆ దుఃఖాన్ని మనసులోనే అణచుకొని మహాసభల కోసం తన శక్తినంతా ధారవోశారాయన.
గాంధేయవాద సిద్ధాంతాల వ్యాప్తికి, నిజమైన గాంధేయవాదుల రూపకల్పనకు 1924లో గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో సాంబమూర్తిగారు రూపకల్పన చేశారు. సబర్మతీ ఆశ్రమం మాదిరిగా రెండవ గాంధేయవాద ఆశ్రమం గౌతమీ ఆశ్రమం. 1927వ సంవత్సరంలో నాగపూర్ పతాక సత్యాగ్రహ దళానికి నాయకత్వం వహించారు. 1928 సంవత్సరంలో హిందూస్తానీ సేవాదళం అధ్యక్షునిగానూ, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. 1929లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. అప్పుడు లాహోర్ కాంగ్రెస్ సభల సమయంలో పూర్ణ స్వరాజ్య ప్రతిపాదన జరిగింది.పూర్ణస్వరాజ్యం అనేమాటని కాంగ్రెస్ సభల్లో మొదటిగా ప్రస్తావించిన గొప్పప్పకి సాంబమూర్తి, ఉప్పుమీద పన్ను ఎత్తివేసేవరకు ఆహారంలో ఉప్పు లేకుండా తింటారు. శపథం చేసి, స్వాతంత్ర్యం లభించేవరకు చొక్కా ధరించనని భీష్మించి, ఆచరించిన ధీరోదాత్తుడు శ్రీ సాంబమూర్తి, బ్రిటిష్ ప్రభుత్వం ఏప్రిల్ 18న, సాంబమూర్తిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది.
సాంబమూర్తి మానసికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి. ఆయనలో తొలినుండీ వైరాగ్య భావన ఉండేది. అందుకే జైలులో పెట్టిన పులుసు, కూర, మజ్జిగ, అన్నం 5 అన్నీ కలిపి ముద్దచేసుకొని తినేవారని ఖాసా సుబ్బారావు పేర్కొన్నారు. సాంబమూర్తిగారి జీవితంలో ఓ విషాద సంఘటన 1932 జనవరి 4వ తేదీన జరిగింది. ఆ రోజు కాకినాడ టౌన్ హాలులో పెద్ద సభ జరుగుతోంది. ఆరోజు, సాంబమూర్తి వేదికపై ఉన్నారు. పారుపూడి సత్యనారాయణ ఉపన్యసిస్తున్నారు.ఇంతలో ముస్తఫాలీఖాన్ లోపలికి ప్రవేశించి, సాంబమూర్తిని లాఠీలతో విపరీతంగా కొట్టేడు. ఖాన్తో పాటుగా వచ్చిన డప్పుల సుబ్బారావు కూడా సాంబమూర్తిని తీవ్రంగా కొట్టేడు. ఖాన్ సాంబమూర్తి ఛాతీపై తన్ని చిత్రహింసలకు గురిచేశాడు. ఆ తరువాత కాలం మారింది.
1937-39లో కాంగ్రెస్ మంత్రివర్గాలు ఏర్పడినప్పుడు రాజగోపాలాచారి పాలనలో సాంబమూర్తి, మద్రాస్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యారు. అప్పుడు, తనపై ఆనాడు దౌర్జన్యం చేసిన ముస్తఫాలీఖాన్ని పిలిచి, “ఆరోజు నీవు చేసిన దుర్మార్గం, నన్ను పెట్టిన చిత్రహింస గుర్తుంది. నేను ఇప్పుడు నిన్ను ఏమైనా చేయగలను. అయితే గాంధేయవాదిగా నిన్ను క్షమిస్తున్నాను” అంటూ మందలించి పంపించేశారు.
ఆయన తన చివరిరోజుల్లో ఆర్థికంగా చాలా బాధలు పడాల్సివచ్చింది. దేశంకోసం సర్వస్వాన్నీ త్యాగం చేసిన ఆ మహానుభావుడు మహర్షి బులుసు సాంబమూర్తికి మనం ఏం ఇవ్వగలం? భక్తితో నమస్కరించడం తప్ప…





