
( ఫిబ్రవరి 24 – సంత్ రవిదాస్ జయంతి )
భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా వున్న కాలమది. ఆ సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. అంబేద్కర్ స్ఫూర్తి పొందిన భక్తి కవులలో ముఖ్యులు కబీర్, సంత్ రవిదాస్‌లు. ఎవరైతే తాము బతికిన కాలంలో ఎంతో మందిని తన భావజాలంతో ప్రభావితం చేస్తారో వాళ్లే చరిత్ర మలుపులో నిలబడి రాబోయే కాలానికి దిశా నిర్ధేశం చేస్తారు. అలాంటి వారిలో రవిదాస్ ఒకరు. అందుకే ఆయన అనునీయులు ఆయన బంగారు విగ్రహాన్ని జలందర్ నుంచి కాశీ వరకూ మోసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభావం పంజాబ్ నుంచి దేశమంతా విస్తరించింది.
సంత్ రవిదాస్ భక్తి కవుల్లో ఒక ఆధ్యాత్మిక భావాన్నే కాకుండా సామాజిక భావాలనూ అభివృద్ధి చేశారు. బానిస భావాలను వ్యతిరేకించారు. మానసిక బానిసత్వాన్ని, కుల బానిసత్వాన్ని, శారీరక బానిసత్వాన్ని వ్యతిరేకించారు. మనిషి స్వతంత్రుడై గౌరవమైన ఆలోచనలతో జీవించాలని, తలవంచి జీవించడాన్ని నిరాకరించారు. ప్రతి మనిషిలోని చైతన్యాన్ని ఆయన ఉద్దీపింపచేశారు. మానవతాపూర్ణంగా మనిషి ఉండాలని తన కవిత్వంతో, తన పాటలతో చాటారు. సమాజాన్ని మేల్కొలిపే బాటలో పయనించారు. ఒకే జ్యోతితో విశ్వం సృష్టి జరిగెను సోదరా…బ్రాహ్మణ-చమార ఎక్కువ-తక్కువ తేడాలేలరా..జన్మ జాతులను ఎంచకు, లేదు కులం, లేదు ప్రాంతం..రవిదాసు ప్రియప్రభువు పుత్రులే అందరు, లేదు కుల భేదం అంటూ సర్వకుల సమానత్వాన్ని ప్రబోధించారు.
సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీవద్ద సీర్ గోవర్దనపురం అనే గ్రామంలో, మాఘపూర్ణిమ రోజున చర్మకార కుటుంబంలో జన్మించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. కలసాదేవి, సంతోఖ్‌దాస్ తల్లిదండ్రులు. రవిదాస్, కబీర్‌కు సమకాలీకుడని చరిత్రకారులు తేల్చారు. ఆయన ఆధ్యాత్మిక సన్యాసిగానే కాక హరిజనుల కోసం ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషిచేశారు. విదేశీ పాలకుడైన సికందర్ లోడీ సాగించిన హింస, మతమార్పిడీలకు వ్యతిరేకంగా సంత్ రవిదాస్ పోరాడారు. జిజియా వంటి అన్యాయ పూరితమైన పన్నులకు వ్యతిరేకంగా ప్రజలలో జాగరణ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజలలో జాతీయ భావాన్ని, స్వాభిమాన భావాన్ని జాగృతం చేయడమే కాకుండా మతం మారిన హిందువులను స్వధర్మంలోకి తీసుకువచ్చే పునరాగమన కార్యక్రమాన్ని చేపట్టారు.
సామాన్యులే కాదు, శ్రీకృష్ణుని ఆరాధకురాలయిన అంత:పురవాసి మీరాబాయి లాంటి వారెందరో రవిదాస్ వెంటనడిచారు. ఆయన పదాలు బనారస్ దాటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌ల వరకూ ప్రవహించాయి. ఆయన కవితల్లో అతి సున్నితంగా సందేశం, శాంతి సమానతలు ప్రజల ఆలోచనల్లో అద్భుతమైన ప్రభావం చూపుతాయి. రవిదాస్‌కు కాశీ మహా రాజు, మహారాణి కూడా శిష్యులయ్యారు. సాక్షాతూ కాశీ మహరాజ్ రవిదాస్ జ్ఞానానికి పాదాక్రాంతులై ఆయన్ని సన్మానించారు. రవిదాస్ జీవితాంతం తన చర్మకార వృత్తిని అవలంబిస్తూనే అత్యంత నిరాడంబరంగా జీవించారు. చిత్తోడ్ రాజు రాణా సంగా, రాణిఝాలీ దేవిల అభ్యర్థన మేరకు రవిదాస్ దంపతులు చిత్తోడ్ వెళ్లారు. అక్కడే రవిదాస్ తన 120వ ఏట భగవంతునిలో లీనమయ్యారని చెపుతారు.
సంత్ గురు రవిదాస్ స్వీయ అనుభవం నుండి, అధ్యయనం నుండి, అవగాహన నుండి, మానవతావాదం నుంచి పుట్టుకొచ్చిన కవితలు, సూక్తులు, పదునైన భావజాలం, ప్రబోధాలు నాటి కాలంలోని వారినే కాక నేటి తరాలను సైతం ప్రభావితం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నాయి. సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ బోధనలను మనసా వాచా కర్మణా ఆచరించాలి. అదే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి..





